AP Employees Guidelines : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు మార్గదర్శకాలు విడుదల..
Andhra Pradesh GAD Guidelines: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీలపై కీలక ప్రకటన వెలువడింది.
- Dharani Pilli
- Updated on- April 28, 2026 / 11:39 AM IST
AP Employees Transfer GAD Guidelines
AP Employees Guidelines : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025కు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ లో నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్ల ప్రాతిపదికన ఉద్యోగుల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి జీఏడీ మార్గదర్శకాలు విడుదల చేస్తే.. అన్ని విభాగాలు బదిలీలు, సర్దుబాటు, పదోన్నతులకు చర్యలు తీసుకోనున్నారు.
ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించేందుకు నోడల్ అధికారులను నియమించాలని జీఏడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నోడల్ అధికారుల వివరాలను కొన్ని విభాగాలు ఇప్పటికే జీఏడీకి పంపించాయి. అన్ని శాఖలు, విభాగాల ఉద్యోగుల వివరాలను ఈ-హ్యూమన్ రిసోర్సు మాస్టర్ (ఈ-హెచ్ఆర్ఎం) ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేయనున్నారు. ఇప్పటికే అన్ని శాఖలు.. ఉద్యోగుల సీనియారిటీ, పని చేస్తున్న జిల్లా తదితర వివరాలన్నీ ఆన్ లైన్ లో నమోదు చేశాయి.
Also Read: ఆంద్ర యూనివర్సిటీ శత జయంతి.. గెస్టులుగా చంద్రబాబు, సచిన్, త్రివిక్రమ్
ఇప్పటి వరకు ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి. కానీ ఇకపై 26 జిల్లాల ప్రకారం పోస్టులను సర్దుబాటు చేయనున్నారు. అలానే ఈ ఏడాది ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు ఉండవు.. సర్దుబాటు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2, టీజీటీ, పీజీటీ పోస్టులు జోనల్ స్థాయిలో ఉండగా.. మిగతా టీచర్ పోస్టులు జిల్లా స్థాయిలో ఉన్నాయి. స్పౌజ్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
జిల్లాల్లోని పోస్టులకు అనుగుణంగా ఈ నిష్పత్తి ఉండనుంది. జోనల్లో పాత జోన్ ప్రకారం సీనియారిటీ, ఇతర రిజర్వేషన్ల ఆధారంగా సొంత జోన్ కు వెళ్లేందుకు అవకాశం కల్పించబోతున్నారు. జిల్లా పోస్టులకు సంబంధించి ఉమ్మడి జిల్లా సీనియారిటీ, రిజర్వేషన్ల ప్రకారం సొంత జిల్లాకు వెళ్లేందుకు ఐచ్ఛికాలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా, జోన్ ప్రకారం సొంత జోన్, జిల్లాకు అవకాశాలు. ఈ సర్దుబాటు పూర్తయిన తర్వాత ఎక్కడి వారు అక్కడ ఆయా జోన్, జిల్లా లోకల్ గా మారిపోతారు. సర్దుబాటు సమయంలో ఆయా జిల్లాలో పోస్టుల అవసరాన్నీ పరిగణనలోకి తీసుకోనున్నారు. దీని వల్ల కొన్నిసార్లు బాగా జూనియర్లకు సొంత జోన్, జిల్లాకు మారే అవకాశం రాకపోవచ్చు.
విద్యా శాఖ ఇప్పటికే 26 జిల్లాలకు నోడల్ అధికారుల ఎంపిక చేసింది. వీరు జీఏడీ, ఆర్థిక శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోస్టులు, సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని పంపిస్తారు. సిబ్బంది ఈ డేటా పాఠశాల విద్య కమిషనరేట్ కి ఇవ్వనున్నారు.
