Mission Vatsalya: ఏపీలో పిల్లలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా రూ.4 వేలు.. డైరెక్ట్ అకౌంట్ లోకే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘మిషన్ వాత్సల్య(Mission Vatsalya)’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.
- V Santhosh Kumar
- Published on- June 27, 2026 / 01:04 PM IST
Andhra Pradesh government, Central government is implementing ‘Mission Vatsalya’ scheme for orphaned and destitute children.
-
అనాథ పిల్లలకు ఆర్థిక సాయం
-
నెలకు నాలుగు వేల రూపాయలు
-
అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి
Mission Vatsalya: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనాథ, నిరుపేద పిల్లల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా ‘మిషన్ వాత్సల్య(Mission Vatsalya)’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. తల్లిదండ్రులు లేని అనాథ చిన్నారుల చదువు, పోషణ నిమిత్తం ఈ పథకం కింద ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఈ నిధులను ఆరు నెలలకు ఒకసారి రూ.24,000 చొప్పున, ఏడాదికి మొత్తం రూ.48,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతం తొలి దశలో ఎంపికైన అనాథలతో పాటు తల్లి లేదా తండ్రిని కోల్పోయినవారు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి పిల్లలు, యాసిడ్ బాధితులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
అర్హత ప్రమాణాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే పిల్లల వయసు 2026 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. అలాగే లబ్ధిదారుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.72,000, పట్టణ ప్రాంతాల్లో రూ.96,000 మించకూడదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఈ ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది. కాగా, ఈ పథకం కింద అందించే మొత్తం నిధులలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతం వాటాను అందిస్తోంది.
దరఖాస్తు విధానం:
అర్హులైన అభ్యర్థులు వెంటనే తమ పరిధిలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టు కార్యాలయం, సీడీపీవో లేదా స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌తో పాటు పిల్లల జనన ధృవీకరణ పత్రం, ఆదాయ, కుల సర్టిఫికెట్లు, రేషన్ కార్డు కాపీ, బ్యాంక్ పాస్ బుక్, సంరక్షకుల గుర్తింపు పత్రాల నకళ్లను జతచేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి సమర్పించాలి. అధికారులు ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హులైన వారితో తుది జాబితాను ప్రకటిస్తారు.
