Andhra Pradesh : ఏపీలోని కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు.. పంతం నెగ్గించుకున్న కాలేజీ యాజమాన్యాలు..
Andhra Pradesh,వాస్తవానికి గత నెలలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 10న ఏపీ ప్రభుత్వం 2024-25కి సంబంధించిన రూ. 1200కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలకు బీర్వోలు విడుదల చేసింది.
- Harishth Thanniru
- Published On : March 13, 2026 / 12:43 PM IST
Andhra Pradesh
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల
- మొదటి దఫాలో బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు రూ.300కోట్లు రిలీజ్
Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులకు లైన్ క్లియర్ చేసింది. కాలేజీ యాజమాన్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయడంలో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. తాజాగా రూ.300 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్.. ఉగాదికి మరో రూ.900 కోట్లు విడుదల చేయనుంది. ఇలా మొత్తం రూ.1200 కోట్లను ఫీజురీయింబర్స్ మెంట్ కింద ప్రభుత్వం విడుదల చేయనుంది.
వాస్తవానికి గత నెలలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 10న ఏపీ ప్రభుత్వం 2024-25కి సంబంధించిన రూ. 1200కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలకు బీర్వోలు విడుదల చేసింది. దీంతో ఫీజుల సొమ్ము తమ అకౌంట్లలో పడుతుందని కళాశాల యాజమాన్యాలు భావించాయి. కానీ, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులకు సంబంధించి మెలిక పెట్టారు.
నిధులు లేకపోయినా ప్రభుత్వం రుణాలు తీసుకొచ్చి బకాయిలు విడుదల చేస్తోందని, కాలేజీ యాజమాన్యాలు ఆ రుణంపై 7.5శాతం వడ్డీని భరించాలని ప్రతిపాదించింది. అందుకు కాలేజీ యాజమాన్యాలు ససేమీరా అనడంతో అధికారులు, కాలేజీ యాజమాన్యాలకు పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఏడాదిలో సాంఘీక సంక్షేమ శాఖ ఆ రుణాన్ని చెల్లిస్తుందని, ఆ భారం కాలేజీలపై పడదని యాజమాన్యాలకు చెప్పారు. అయినా సరే ఈ ప్రతిపాదనకు కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోలేదు. ఇటు వడ్డీ భరించాలనే ప్రతిపాదనకు కాలేజీ యాజమాన్యాలు నో చెప్పారు.
ప్రభుత్వం నుంచి తమకు బకాయిలు రావాలని, అలాంటిది తాము రుణం తీసుకున్నట్లు చూపడం ఏమిటని కాలేజీ యాజమాన్యాలు ప్రశ్నించాయి. ఉన్నత విద్యాశాఖ అధికారులు చెప్పినట్లు ఒప్పుకుంటే రూ.1200 కోట్లలో రూ.90కోట్లు కాలేజీలకు దక్కవు. అయితే, ఈ విషయంపై కాలేజీ యాజమాన్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించడంతో సమస్యకు పరిష్కారం లభించింది.
వడ్డీ ప్రతిపాదన విషయంలో అధికారుల తీరును సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టినట్లు తెలిసింది. దీంతో సాంఘీక సంక్షేమ శాఖ ఫీజుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి దశగా బీసీ-డీ కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ.300 కోట్లు ఫీజులు విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లు ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో కాలేజీ యాజమాన్యాలు ఊపీరి పీల్చుకున్నాయి. అయితే త్వరలోనే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కాలేజీల యాజమాన్యాల అకౌంట్‌లలో జమ చేయనున్నారు.
