Chilli Price at Guntur : గత ఐదేళ్లుగా అప్పులు.. ఈ ఏడాది ఆ రైతులు పంట పండింది.. క్వింటాల్ కు ఏకంగా రూ.20 వేలు
Chilli Price at Guntur : ఈ సంవత్సరం మిరప రైతుల పంట పండింది. క్వింటాల్ మిర్చి ధర రూ.20 వేల వరకు పలుకుతోంది.
- Dharani Pilli
- Published On : March 23, 2026 / 07:46 AM IST
andhra pradesh red dry chilli rs 20000 per quintal at guntur market yard
Chilli Price at Guntur : గత ఐదు సంవత్సరాలుగా రైతులకు భారీ నష్టాలు అందిస్తోన్న మిరప పంట ఈ సారి మాత్రం సిరులు కురిపించింది. వరుసగా నష్టాలు రావడంతో ఇక సాగు చేయడం తమ వల్ల కాదంటూ కొందరు మిరప సాగు చేయలేదు. ఇది కాస్త కలిసి వచ్చింది. జనవరి ప్రారంభం వరకు నామమాత్రం ధరలు ఉన్నా.. కొత్త సంవత్సరం నుంచి మిరప ధరలు పైపైకి చేరాయి. ప్రస్తుతం క్వింటాల్ మిరపకు సగటున రూ.20 వేల ధర పలుకుతోంది. జనవరికి నేటికి ధరను పోలిస్తే.. సుమారు 5 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం మిరపకు డిమాండ్ బాగా ఉండటంతో.. వ్యాపారులు గ్రామాలకు వెళ్లి నేరుగా రైతుల వద్ద నుంచి మిరప కొనుగోలు చేస్తున్నారు. తాజా పరిణామంతో గత ఐదేళ్లుగా మిరప సాగుతో నష్టాలు చవి చూసిన రైతులు ఈసారి లాభాలను కళ్ల చూస్తున్నారు.
మిర్చికి ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉందంటే.. గత మంగళవారం గుంటూరు మార్కెట్ యార్డుకు 1.29 లక్షల బస్తాల మిర్చి రాగా, 1.26 లక్షల బస్తాలు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి మిర్చికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మిరప సాగు తగ్గిపోయింది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో మిర్చికి మంచి డిమాండ్ ఉండటంతో.. ఈ సంవత్సరం జనవరి నుంచి మిర్చి ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతేడాది ఇదే సమయానికి రూ.10 వేలకు అమ్ముడుపోయిన మిర్చికి ఇప్పుడు రూ.20 వేల ధర పలుకుతోంది.
సన్న రకాలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో రూ.15 వేలు ఉన్న తేజ మిర్చి క్వింటాల్ ధర ప్రస్తుతం రూ.19,500కు చేరింది. తాలు ధరలు క్వింటాలుకు రూ.10 వేలకు పైనే ఉన్నాయి. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు మిరప కోసిన వెంటనే ఆరబెట్టి అమ్మేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సంవత్సరం మిరప సాగుకు పెట్టుబడులు భారీగా పెరిగాయి. అన్ని ఖర్చులూ కలిపి ఎకరాకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందంటున్నారు అన్నదాతలు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. సగటున క్వింటాలుకు రూ.18 వేల ధర లభిస్తే.. అప్పుడు రూ.4.50 లక్షల వరకు చేతికొస్తోందని తెలిపారు.
