AP Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ
AP Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
AP Weather Updates
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్
- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
- భీకర గాలులు.. బయటకు రావొద్దని సూచన
AP Weather Updates : ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో వింత వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు.. సరియైన వర్షాలు పడకపోవటంతో రైతులు సాగు పనుల్లో ముందుకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోని ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిలకు జారీ చేసింది.
Also Read : Covid Health Insurance : మళ్లీ కోవిడ్ కలకలం.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి!
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్–జార్ఖండ్–ఉత్తర ఒడిశా ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుండటంతో దాని ప్రభావం రాష్ట్రంపై కనిపించనుందని అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశముండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
శనివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రత్యేకంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలవొద్దని హెచ్చరించారు. అలాగే తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రావొద్దని, అత్యసరమై బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు.
