AP Rain Alert : ఏపీవైపు దూసుకొస్తున్న మరో తుపాన్.. ఈసారి మూడ్రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులు

AP Rain Alert : ఏపీవైపు మరో తుపాను ముప్పు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఈనెల 31వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడనుంది. అది తుపానుగా మారి ఏపీవైపు దూసుకొచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

AP Rain Alert

AP Rain Alert : ఏపీలో అర్నబ్ తుపాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై తుపాను విరుచుకుపడింది. ఉత్తరాంధ్ర జిల్లాలపై కూడా తుపాను ప్రభావం చూపింది. దీంతో ఆయా జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలాయి. భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. అర్నబ్ తుపాను ప్రభావంతో దాదాపుగా 4,600 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అర్నబ్ సృష్టించిన బీభత్సం మరువక ముందే ఏపీని అతలాకుతలం చేసేందుకు మరో తుపాను దూసుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : PM Kisan 24th Installment :10 లక్షల మంది రైతులకు రూ. 2వేలు పడవు? పీఎం కిసాన్ లిస్ట్‌లో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి!

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం తుపానుగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈనెల 31వ తేదీ నాటికి అది వాయుగుండంగా బలపడనుంది. అది తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

వాయుగుండం తుపానుగా మారితే.. నవంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నవంబర్ 2 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నంతో పాటు ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరోవైపు ఇవాళ (30వ తేదీ) అల్లూరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందు నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొంగిపొర్లే కాలువలు, వాగులు దాటే ప్రయత్నం, నది ఈతకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చరించింది.