AP Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు..
AP Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది.
- Harish Thanniru
- Updated on- October 29, 2026 / 11:42 AM IST
Another low-pressure area in the Bay of Bengal
AP Rains : ఏపీలోని కోస్తా జిల్లాల్లో అర్నబ్ తుపాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై తుపాను విరుచుకుపడింది. ఉత్తరాంధ్ర జిల్లాలపైనా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. భీకర గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లగా.. రహదారులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అర్నబ్ తుపాను తీరం దాటడంతో ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు వర్షం, ఈదురుగాలుల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీని మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : AP Dharani Rice: ఏపీ ప్రజలకు భారీ ఊరట.. ధరణి బ్రాండ్ పేరుతో 26 కేజీల బియ్యం బస్తా.. ధర ఎంతంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, వాయుగుండం పయనం పై మరో 24 గంటల్లో స్పష్టత వచ్చే ఆవకాశం ఉంది. తీవ్ర వాయుగుండంగా మారితే ఏపీని మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలాఉంటే.. అర్నబ్ తుపాన్ సృష్టించిన బీభత్సం మరువకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందనే వార్త ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, అల్పపీడనం వాయుగుండంగా మారి ఎటు ప్రయణిస్తుంది.. ఏపీకి ఏమేర ముప్పు పొంచి ఉంది.. ఏ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అసలు వాయుగుండం కారణంగా ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందా? అనే అంశాలపై ఇవాళ రేపట్లో స్పష్టం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అర్నబ్ తుపాను తీరందాటినా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రభావం తగ్గలేదు. భారీ వర్షాలతోపాటు భీకరగాలులు వీస్తున్నాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
తుపాను ప్రభావంతో ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రహదారులపైకి వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు వంశధార, బహుదా నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. నదులు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
