AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ.. స్థానిక పోరుపై మంత్రులకు దిశానిర్దేశం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం(AP Cabinet Meeting) జరగనుంది.
- V Santhosh Kumar
- Published on- October 7, 2026 / 08:04 AM IST
AP Cabinet meeting today and CM Chandrababu discussion key points about local body elections
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు బుధవారం ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా అంశాలతో పాటు పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ ప్రముఖ సంస్థలు, పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసే ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర ప్రాధాన్యత కార్యక్రమాల పురోగతిపై కూడా అమరావతి వేదికగా మంత్రులతో సీఎం సమీక్షించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు.. పొలిటికల్ క్లాస్ తీసుకోనున్న సీఎం చంద్రబాబు:
మంత్రివర్గ సమావేశం పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబు (AP Cabinet Meeting)మంత్రులతో ప్రత్యేకంగా రాజకీయ పరిణామాలపై భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వం అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా స్థానిక పోరులో బీసీ సామాజిక వర్గానికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశముంది. దీంతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, సీట్ల సర్దుబాటు అంశాలు కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.
