AP DSC Notification 2026: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల మరో డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులో తెలుసా?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం 'డీఎస్సీ-2026' నోటిఫికేషన్‌కు పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది.
Ap dsc 2026 notification on october 15 over 2500 teacher posts to be filled
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు, ‘డీఎస్సీ-2026’ నోటిఫికేషన్‌కు పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా వివిధ యాజమాన్యాల వారీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీల వివరాలను ఇప్పటికే సేకరించి ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అక్టోబరు 15న ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.
2,500కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సమాయత్తం:
ఈ సారి డీఎస్సీ ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక, గిరిజన గురుకులాలు, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమ విద్యాసంస్థలు, ఆదర్శ పాఠశాలల్లో కలిపి 2,500కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం పాఠశాల విద్య పరిధిలోనే సుమారు 2,250 ఖాళీలు ఉండగా, మిగిలిన సంక్షేమ పాఠశాలల్లో మరో 300 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులతో పాటు డైట్, ఎస్సీఈఆర్టీ లెక్చరర్లు 160, జూనియర్ లెక్చరర్లు 209, లైబ్రేరియన్ల పోస్టులు 100 వరకు ఏపీపీఎస్సీ ద్వారా నింపనున్నారు.
2029 వరకు వార్షిక జాబ్ క్యాలెండర్ ప్రణాళిక:
ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ప్రయోజనార్థం 2029 వరకు ఏటా భర్తీ చేయాల్సిన ఖాళీలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించింది. మొత్తం ఖాళీల్లో 70 శాతం పోస్టులను ఉపాధ్యాయుల పదోన్నతుల ద్వారా, మిగిలిన 30 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేలా ముందుస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. రాబోయే 2027, 2028, 2029 సంవత్సరాలకు సంబంధించిన ఖాళీల అంచనా జాబితాను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
