AP EAPCET 2026 Results : ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా.. జులై 2న విడుదల
AP EAPCET 2026 Results : ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి.
- Harish Thanniru
- Updated on- June 30, 2026 / 01:34 PM IST
AP EAPCET 2026 results postponed
AP EAPCET 2026 Results : ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న ఎప్‌సెట్ (AP EAPCET 2026) ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. వాస్తవానికి జూన్ 30న మధ్యాహ్నం 3గంటలకు ఫలితాలు విడుదలవుతాయని అధికారులు తెలిపారు. కానీ, ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. తిరిగి ఎప్‌సెట్ ఫలితాలను జులై 2న (గురువారం) విడుదల చేయనున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. జూన్ 1వ తేదీ నాటికే ఏపీ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే, వివిధ సాంకేతిక, నిర్వహణ కారణాలను చూపుతూ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇవాళ (జూన్ 30) ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ.. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఫలితాలను వాయిదా వేయడం జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎప్‌సెట్ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 3.29 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీన ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ ఉండటంతో ఏఒక్క విద్యార్థికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తిస్థాయిలో వచ్చే వరకు ఎప్‌సెట్ ఫలితాలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
జులై 2వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే, ఫలితాలు ఆలస్యమవుతుండటంతో ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్‌పైనా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
