AP-PMAY Urban: ఏపీ పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. సొంతింటి కోసం రూ.2.89 లక్షల సాయం.. డైరెక్ట్ అకౌంట్ లోకే
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (AP-PMAY Urban) 2.0 పథకం కింద తొలివిడతగా 17,912 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
- V Santhosh Kumar
- Updated on- September 1, 2026 / 04:58 PM IST
Ap government approves pmay urban 2 housing scheme sanction funds
- పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి
- ఒక్కో ఇంటికి భారీ సాయం
- నేరుగా ఖాతాల్లోకే నగదు జమ
AP-PMAY Urban: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (PMAY-U) 2.0 పథకం కింద తొలివిడతగా 17,912 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ బృహత్తర కార్యక్రమం కోసం రూ.447.80 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ పథకం ద్వారా పట్టణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.
ఒక్కో ఇంటికి రూ.2.89 లక్షల సాయం:
ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారునికి కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాయి. దీనికి అదనంగా ఉపాధి హామీ (VB-GIRAMJI) కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు కలిపి మొత్తంగా రూ.2.89 లక్షలు అందనున్నాయి. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. మంజూరైన ఇళ్లలో అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 గృహాలు కేటాయించగా, పల్నాడు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పశ్చిమగోదావరి జిల్లాకు అత్యల్పంగా 212 ఇళ్లు దక్కాయి.
నాణ్యమైన నమూనాలు – కలెక్టర్ల ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ:
లబ్ధిదారులు నిర్మించుకునే ఇళ్లు కనీసం 30 నుండి గరిష్ఠంగా 45 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థల విస్తీర్ణానికి తగినట్లుగా ఎంచుకోవడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక నమూనా డిజైన్లను అందుబాటులో ఉంచనుంది. సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఈ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ పనులను పర్యవేక్షిస్తారు. కేంద్రం మంజూరు చేసే తదుపరి విడత ఇళ్లను కూడా ఎప్పటికప్పుడు అర్హులైన పట్టణ పేదలకు కేటాయించేలా చర్యలు చేపడుతున్నారు.
