Nethanna Bharosa : ఏపీలో మరో కొత్త పథకం అమలుకు సిద్ధమైన సర్కార్.. ఒక్కొక్కరికి రూ.25వేలు సాయం

Nethanna Bharosa Scheme : ఏపీలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 7వ తేదీ నుంచి కొత్త పథకం అమలుకు సిద్ధమవుతోంది.

AP Government to Implement Nethanna Bharosa Scheme Starting August 7

  • ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
  • మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్న సర్కార్
  • ఆగస్ట్ 7న పథకం అమలుకు నిర్ణయం

Nethanna Bharosa Scheme : ఏపీలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అన్నివర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్త కొత్త పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త పథకం అమలుకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.

Also Read : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. వినియోగదారులకు ఊరట!

ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 7న నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది.

నేతన్నకు భరోసా పథకం కింద చేనేత కార్మికులు ఒక్కొక్కరికి రూ.25వేలు సాయం అందించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద చేనేతలకు రూ.24వేలు ఇవ్వగా.. కూటమి ప్రభుత్వం అదనంగా మరో రూ. వెయ్యి కలిపి రూ.25వేలు అందజేయనుంది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకం అమలుకోసం రూ.250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54వేల మంది అర్హులు ఉంటారని చేనేత, జౌళిశాఖ అధికారులు అంచనా వేశారు. సొంత మగ్గం ఉండే చేనేత కార్మికులకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి ఒకరికి చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుబంధ రంగాలకు చెందిన వారికి ఆర్థిక సాయం అందలేదు. అయితే, విజ్ఞప్తులు రావడంతో చేనేతకు అనుబంధంగా ఉండే రాట్నం వడకడం, రంగులు అద్దడం, తదితర రంగాల వారికి కూడా పథకం వర్తింపజేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఈ రంగాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది అర్హులు ఉంటారని అంచనా. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇప్పటికే చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తోంది. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు.. చేనేతలకు పింఛన్ ను రూ.4వేలకు కూటమి ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90శాతం రాయితీ అందిస్తున్నారు. ముడి సరుకులపై 15శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తుంది. ఇలా పలు విధాలుగా చేనేతలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుండగా.. తాజాగా నేతన్నకు భరోసా పథకాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది.