AP Social Media Influencer Policy : ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం..టాలెంటెడ్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు పండగే.. వీడియో పెట్టు పైసలు పట్టు!

AP Government Social Media Influencer Policy : ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలను సోషల్ మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Social Media Influencer Policy

AP Government Social Media Influencer Policy : సోషల్ మీడియా విస్తృతి పెరుగుతున్న కొద్దీ ప్రజలకు సమాచారం చేరే విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం పత్రికలు, టీవీ ప్రకటనలు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలను విస్తృతంగా ఉపయోగించేవారు. ఆ తర్వాత డిజిటల్ మీడియా, బ్రాండ్ అంబాసిడర్ల వైపు ప్రభుత్వాల దృష్టి మళ్లింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే ప్రతి సమాచారం అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు కీలకంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ తీసుకొస్తోంది.

Also Read – Corporate Job Crisis : వయస్సు 40 దాటితే ఉద్యోగం ఊడినట్లేనా? ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ విషయంలో కొత్త చర్చ.. వాళ్లే ఎందుకు టార్గెట్‌?

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలను సోషల్ మీడియా ద్వారా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ పాలసీ ఉద్దేశంగా చెబుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్, రీచ్ ఉన్న కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో అవకాశం కల్పించనున్నారు.

గతంలో ప్రభుత్వం ఏదైనా పథకం ప్రారంభించినా, కీలక నిర్ణయం తీసుకున్నా.. దాని గురించి ప్రజలకు తెలియజేయడానికి పత్రికలు, టీవీలు, రేడియో, హోర్డింగ్స్ వంటి సంప్రదాయ మీడియాపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అయితే సోషల్ మీడియా విస్తరించడంతో పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం నాయకుల పర్యటనలు, ప్రసంగాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల వివరాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం క్షణాల్లో ప్రజలకు చేరుతోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి వేదికల ద్వారా కంటెంట్ వైరల్ అయ్యే అవకాశం ఉండటంతో.. ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పాలసీలో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వారి ఫాలోవర్లు, వ్యూస్, కంటెంట్ రీచ్ వంటి అంశాల ఆధారంగా కేటగిరీలుగా విభజించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలపై కంటెంట్ రూపొందించే వారికి నిర్ణీత పారితోషికం చెల్లించే విధానాన్ని రూపొందిస్తున్నారు.

ప్రాథమికంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను నాలుగు కేటగిరీలుగా విభజించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కేటగిరీ-ఏలో లక్షకు పైగా వ్యూస్ ఉన్న వారికి రూ.15 వేలు, కేటగిరీ-బీలో రూ.7,500, కేటగిరీ-సీలో రూ.5,000 చొప్పున చెల్లించే విధానం గురించి సమాచారం వెలువడింది. ఫాలోవర్ల సంఖ్యతో పాటు కంటెంట్ రీచ్, వ్యూస్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సొంతంగా కంటెంట్‌ను రూపొందించే క్రియేటర్లకు అదనపు ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రచారం చేయాలనుకునే ఇన్‌ఫ్లుయెన్సర్లు ముందుగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇన్‌ఫ్లుయెన్సర్ల సోషల్ మీడియా ఖాతాలు, ఫాలోవర్లు, వ్యూస్, కంటెంట్ తదితర అంశాలను పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన వారిని ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించే విధానం ఉండనున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రచారం చేయడం దేశంలో పూర్తిగా కొత్త విధానం కాదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా విధానం అమల్లోకి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత రాజస్థాన్, గోవా, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి మోడళ్లను అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ప్రచారంలో సోషల్ మీడియా క్రియేటర్లను అధికారికంగా భాగస్వామ్యం చేయడం క్రమంగా విస్తరిస్తున్న ట్రెండ్‌గా మారింది.

ఏపీ ప్రభుత్వం సోషల్, డిజిటల్ మీడియా ప్రచారానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు సమాచారం. సంవత్సరానికి సుమారు రూ.40 కోట్ల వరకు సోషల్, డిజిటల్ మీడియా ప్రచారానికి ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లతో సమావేశమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై వారికి వివరాలు అందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు స్థానికంగా ప్రభావం ఉన్న కొందరు సోషల్ మీడియా క్రియేటర్లతో మాట్లాడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ పాలసీ ద్వారా ఒకవైపు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం లభించే అవకాశం ఉంది. మరోవైపు కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు కొత్త ఆదాయ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ ప్రచారంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్ర పెరగడం వల్ల పారదర్శకత, కంటెంట్ ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, చెల్లింపుల విధానం వంటి అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి.

మొత్తంగా చూస్తే.. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కూడా తన ప్రచార వ్యూహాన్ని మార్చుకుంటోంది. సంప్రదాయ మీడియాతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రభుత్వ ప్రచార వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా కొత్త తరానికి ప్రభుత్వ సమాచారం చేరువ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ఈ పాలసీ అమలు తర్వాత సోషల్ మీడియా క్రియేటర్లకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయి? ప్రభుత్వ ప్రచారంలో వారి పాత్ర ఎంతవరకు పెరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.