AP Dharani Rice: ఏపీ ప్రజలకు భారీ ఊరట.. ధరణి బ్రాండ్ పేరుతో 26 కేజీల బియ్యం బస్తా.. ధర ఎంతంటే?

AP Government Dharani Rice Price: ధరణి బ్రాండ్ బియ్యాన్ని రైతు బజార్లలో మాత్రమే కాకుండా మొబైల్‌ వాహనాల ద్వారా మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు కూడా విక్రయాలను విస్తరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

Ap Government Key Decision 26 Kg Bag Under The Brand Name Dharani

AP Government Dharani Rice: దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో బహిరంగ మార్కెట్లో బియ్యంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా పలు రకాలకు చెందిన బియ్యం కిలో రూ. 80 నుంచి రూ.100కు చేరింది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది.

Also Read – School Holidays : అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

భారీగా పెరుగుతున్న బియ్యం, నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు ఊరట కలిగించేలా రాయితీపై పలు రకాల వస్తువులను అందిస్తోంది. ఫైన్ రకం బియ్యంతోపాటు.. ఉల్లిపాయతోపాటు ఇతర కూరగాయలను రాయితీపై అందిస్తోంది. అయితే, ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఊరటనిచ్చే విధంగా రూ. 1300లకే ధరణి బ్రాండ్ 26కిలోల సన్నబియ్యం బస్తాను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలులో తిరుపతి జిల్లా కీలక పాత్ర పోషిస్తోంది. జిల్లాలోని రెండు ప్రధాన రైస్ మిల్లుల నుంచి తిరుపతి జిల్లాతోపాటు చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల మొత్తం ఎనిమిది జిల్లాలకు ధరణి బియ్యం బస్తాలను సరఫరా చేస్తున్నారు. ప్రతీరోజూ వేలాది క్వింటాళ్ల బియ్యం రైతుబజార్లు, పంపిణీ కేంద్రాలకు రవాణా అవుతోంది. తక్కువ ధరకు అందిస్తున్న 26కిలోల ధరణి బ్రాండ్ సన్న బియ్యం బస్తాలను అర్హులైన ప్రతీఒక్కరికీ పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారు. బస్తాను పొందే వినియోగదారుని పేరు, ఆధార్, పోన్ నెంబర్లను నమోదు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ ధరణి బ్రాండ్ బియ్యాన్ని రైతు బజార్లలో మాత్రమే కాకుండా మొబైల్‌ వాహనాల ద్వారా మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు కూడా విక్రయాలను విస్తరించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సూపర్‌ ఫైన్‌ రకం బియ్యాన్ని కిలో రూ.49, రూ.50కు విక్రయుంచాలని అన్నారు. మిగిలిన బియ్యం ధరలపైనా నియంత్రణ ఉండేలా చూడాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. మరోవైపు బియ్యం ధరలు అదుపులో ఉండేలా మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులతో అధికారులు చర్చిస్తున్నారు. కొన్నిరకాల బియ్యం ధరలను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. బీపీటీ రకం స్టీమ్‌ బియ్యం కేజీ రూ.66, సాధారణ స్టీమ్‌ బియ్యం కేజీ రూ.47కు మించకుండా విక్రయించేందుకు అంగీకరించారని అధికారులు చెబుతున్నారు.