ap government offer rs 25000 incentive for 3rd child and onwards
AP Third Child: దేశంలోని పలు రాష్ట్రాల్లో జననాల సంఖ్య తగ్గుతుందని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల రానున్న రోజుల్లో పనిచేసే యువత సంఖ్య తగ్గి, ఆధారపడే వృద్ధుల జనాభా పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వాలపై అదనపు భారం పడటమే కాక, సమాజ ప్రగతి కూడా కుంటుపడుతుంది. ఈ క్రమంలో జననాల సంఖ్య తగ్గుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ జనాభాను పెంచడమే లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారి సంచలన నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకంతో పాటుగా ఆ బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఉచిత విద్యతో పాటు, పోషణ కోసం ఐదేళ్ల పాటు ప్రతి నెలా రూ. 1000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.
అయితే జనాభా పెరుగుదల కోసం ఏపీ ప్రభుత్వం గతంలోనే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా మన దేశంలో ఇద్దరు బిడ్డల కన్నా ఎక్కువ ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర జనాభాను పెంచడం కోసం ఈ నిబంధనను రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా ఇద్దరి కన్నా ఎక్కువ బిడ్డలను కనే దంపతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకు వచ్చింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? సర్కార్ ఆలోచన ఏంటి?
మూడో బిడ్డను కనే మహిళలకు డెలివరీ సమయంలో రూ. 25 వేలు ప్రోత్సాహకంగా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. జనాభా నిర్వహణ డ్రాఫ్ట్ పాలసీపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో ఈ ప్రకటన చేశారు. ఇద్దరి కన్నా ఎక్కువ బిడ్డలను కంటే, ఆ పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెలా పోషణ కింద రూ. 1000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలానే ఆ పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. మూడో సంతానం, ఆపై బిడ్డలను కనే మహిళలకు 12 నెలల పేరెంటల్ లీవ్, ఆ తండ్రులకు 2 నెలల పటర్నల్ లీవ్ ఇచ్చేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ నుంచి జనాభా నిర్వహణ పాలసీ అమల్లోకి వస్తుందని తెలిపారు.
మారుతున్న కాలానికి తగ్గట్టుగా జనాభా పెరుగుదల భారం కాదని, అధిక జనాభా రాష్ట్రానికి లాభం అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇన్నేళ్ల పాటు రాష్ట్రంలో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, కానీ ఇక మీదట ‘పాపులేషన్ కేర్’ పై దృష్టి పెట్టనున్నట్టు సీఎం ప్రకటించారు. దీని కోసమే దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ పాలసీని ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని తెలిపారు. సంవత్సరం తర్వాత ఫలితాలను పరిశీలించి, పాలసీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ఆరోగ్యం, సంపద, సంతోష ఆంధ్రప్రదేశ్ (హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ) అనేది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యం అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.