స్విస్ టెక్నాలజీతో ఏపీలో పేదలకు ఇళ్లు

ఏపీలో పేదలకు నిర్మించే ఇళ్లకు స్విస్ టెక్నాలజీ వాడనుంది ప్రభుత్వం. ఇండో–స్విస్‌ టెక్నాలజీతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తేవాలనుకుంటోంది. ఈ కారణంగా విద్యుత్‌ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డిగ్రీల వరకు తగ్గుతాయని గుర్తించారు. ప్రాజెక్టు గురించి వివరించేందుకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) అధికారులు ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌తో భేటీ అయ్యారు. 

దేశంలో తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ రెసిడెన్షియల్‌ (ఈసీబీసీఆర్‌) ప్రకారం.. ఇండో స్విస్‌ ఫ్యూయల్ కెపాసిటీ టెక్నాలజీని బలహీనవర్గాల గృహాలకు అందజేస్తామని తెలిపారు. హౌసింగ్, రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ, బీప్‌ అధికారులతో అజయ్‌ జైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ప్రకటనలో మీడియా ముందుంచడం విశేషం. 

ఈ టెక్నాలజీ గురించి ఏం చెప్పారంటే:
ఈ టెక్నాలజీ వల్ల గృహ నిర్మాణ వ్యయం తగ్గుతుందని బీఈఈ పేర్కొంది. 30 లక్షల ఇళ్లలో ఎల్‌ఈడీ లైట్లు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన ఫ్యాన్లు, ఇతర ఎనర్జీ సామర్థ్య ఉపకరణాలను అమర్చేందుకు సహకరించాల్సిందిగా ఏపీ స్టేట్‌ ఎనర్జీ ఎఫిషిఎన్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ సీడ్కో) కోరారు. దేశంలో ఈసీబీసీ రెసిడెన్షియల్‌ కోసం కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలను నామినేట్‌ చేయగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది.   

* పేదలు, బలహీనవర్గాలకు 14వేల 97 జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. 
* ఇళ్లల్లో హాల్, బెడ్‌ రూమ్, కిచెన్, టాయిలెట్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇంటి మొత్తం విస్తీర్ణంలో 16.66 శాతం ఓపెన్‌ ఏరియా ఉంటుంది.

*  ఇంటి నిర్మాణంలో కొన్ని రకాల మెటీరియల్స్‌ వాడటం, సాంకేతిక చర్యలు చేపట్టడం ద్వారా ఇంట్లోని ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతాయి. సీలింగ్‌ దగ్గరలో గ్లాస్‌ ఫిట్టింగ్‌ ఉండే కిటికీలు, ఇంటి పైకప్పు, గోడలను పర్యావరణహితంగా నిర్మిస్తారు. 
* ఇండో-స్విస్‌ టెక్నాలజీతో ఇళ్లు కట్టడం వల్ల పగటిపూట ఇంటి లోపల సహజసిద్ధమైన వెలుతురు పెరుగుతుంది. కానీ చల్లదనం మాత్రం ఉంటుంది.  
* స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తున్నారు. 

మరోవైపు ఇంధన సామర్థ్యం గల పరికరాలు, అతి తక్కువ కరెంట్‌ను వినియోగించుకునే పరికరాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్విస్‌ టెక్నాలజీ వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత 4 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతుంది. కాబట్టి ఏసీలు, కూలర్లు అంతగా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌ కంపెనీలు టెక్నికల్ నాలెడ్జ్‌ను మనకు అందిస్తున్నాయి.  

Also Read | తెలంగాణలో కరోనా ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ మాటేంటి?