AP Assigned House Plots : ఏపీ వాసులకు శుభవార్త.. ఇకపై నిషేధిత జాబితాలో ఉన్న స్థలాల్ని సులభంగా అమ్ముకోవచ్చు

AP Assigned House Plots : కూటమి సర్కార్ ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆ స్థలాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

AP govt guidelines to registration and sale of assigned house plots listed in 22 a prohibited properties list

AP Assigned House Plots : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ స్థలాలు, ఇళ్ల స్థలాలను ఇకపై సులభంగా అమ్ముకోవచ్చు. ఇందుకు గాను ఎలాంటి పత్రాలు అవసరం లేదు. కేవలం పట్టా, ఇంటి పన్ను రసీదు చూపిస్తే చాలు. తాజాగా కూటమి సర్కార్.. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాలోని ఇళ్ల స్థలాల అమ్మకాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సులభతరం చేసింది. ప్రభుత్వం స్థలం కేటాయించి పదేళ్లు పూర్తయితే చాలు.. ఎలాంటి అదనపు పత్రాలు లేదా అభ్యంతర పత్రాలు (NOC) లేకుండానే వాటిని అమ్ముకోవడానికి, ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తూ తాజాగా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు ఈ స్థలాల అమ్మకాలకు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఈ ఆస్తులు నిషేధిత భూముల జాబితా (22-ఎ) లో ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్‌కు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు:

నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ ఇళ్ల స్థలాలను అమ్ముకోవాలంటే.. రిజిస్ట్రేషన్ సమయంలో లబ్ధిదారులు ఈ క్రింది పత్రాలను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

  • అధికారిక పట్టా: ప్రభుత్వం ఆ భూమిని ఇంటిస్థలంగా కేటాయించినట్లు నిరూపించే ఒరిజినల్ పట్టా లేదా అసైన్‌మెంట్‌ ఆర్డర్‌.
  • ఇంటి పన్ను రసీదు: కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించినట్లు స్థానిక మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన ఇంటిపన్ను రసీదు.

అదికారులు పైన పేర్కొన్న పత్రాలు కాకుండా.. మరే ఇతర అదనపు డాక్యుమెంట్లు అడగకూడదు.

రిజిస్ట్రేషన్ నియమ నిబంధనలు

ఎవరు అర్హులంటే..

ఆస్తిని విక్రయించే వ్యక్తి అసలు కేటాయింపుదారుడైనా అయి ఉండాలి లేదా వారి చట్టబద్ధ వారసులైనా అయి ఉండాలి. ఒకవేళ వారసులైతే.. అసలు లబ్ధిదారుడి మరణ ధ్రువీకరణ పత్రం (Death Certificate)తో పాటుగా.. కుటుంబ సభ్యుల (ఫ్యామిలీ మెంబర్‌) సర్టిఫికెట్‌ తప్పనిసరిగా జతచేయాలి.

పదేళ్ల కాలపరిమితి:

ఈ స్థలం అమ్మకాలు, రిజిస్ట్రేషన్ చేయాలంటే.. స్థలం కేటాయించి 10 సంవత్సరాలు పూర్తయిందా లేదా అన్నది రిజిస్ట్రేషన్ अधिकारी/అధికారి ఖచ్చితంగా ధ్రువీకరించుకోవాలి.

ప్లాట్, సర్వే నంబర్ల గుర్తింపు:

ఈ స్థలాల అంశానికి వస్తే కేవలం సర్వే నంబర్‌/బ్లాక్‌ నంబర్‌ ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. నిర్దిష్ట ప్లాట్‌ నంబర్‌తో పాటు దానికి సరిపోయే సర్వే నంబర్‌/ బ్లాక్‌ నంబర్‌ల కలయికను సరిచూసి ఆ తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి.

సెక్షన్ 22-ఎ మినహాయింపు:

1908 రిజిస్ట్రేషన్‌ చట్టం సెక్షన్‌ 22-ఎ కింద ఈ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ.. అవి కేటాయించి పదేళ్ల కాలపరిమితి ముగిస్తే.. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌కు అంగీకరించాలి.

ఓటీఎస్‌ (OTS) లబ్ధిదారులకు ఉపశమనం:

వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌) లేదా ఇతర ప్రభుత్వ పథకాల కింద క్రమబద్ధీకరించిన ఆస్తులకు ఎలాంటి అదనపు పత్రాలు అడగకుండానే రిజిస్ట్రేషన్‌ చేయాలి.

తదుపరి లావాదేవీలు:

పైన పేర్కొన్న నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలకు సంబంధించి ఒకసారి రిజిస్ట్రేషన్‌ పూర్తయితే, తదుపరి లావాదేవీలను (మళ్లీ వేరేవాళ్లకు అమ్మడం వంటివి) 90 రోజుల తర్వాత ఎలాంటి అదనపు ధ్రువీకరణలు లేకుండానే అనుమతించవచ్చు.