AP Free IVF Treatment : AP సర్కార్ శుభవార్త.. ఇకపై లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పని లేదు.. ఉచితంగా ఆ చికిత్స..
AP Free IVF Treatment : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది.
- Dharani Pilli
- Updated on- May 3, 2026 / 04:32 PM IST
ap govt plans new population policy with free ivf treatment and incentives to boost birth rate
- ఏపీ ప్రజలకు శుభవార్త
- ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స
- ప్రతి ఏటా 50 వేల జంటలకు
AP Free IVF Treatment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేలు, లక్షల రూపాయలు ఖర్చయ్యే ఐవీఎఫ్ చికిత్సను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. వివిధ సమస్యల వల్ల పిల్లలు పుట్టక ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్న వారికి ఇది నిజంగా భారీ ఊరట కలిగించే వార్త. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకురాబోతున్న ఏపీ సర్కార్.. దీనిలో భాగంగా పాత కాలం నాటి కుటుంబ నియంత్రణ విధానానికి ముగింపు పలికి.. దాని స్థానంలో అధిక సంతానం పాలసీకి స్వాగతం పలికేందుకు రెడీ అయ్యింది.
దీనిలో భాగంగా 2026, ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకురానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.782 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలానే సంతానోత్పత్తిని పెంచేందుకు కూటమి సర్కార్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఆరోగ్యాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ పేరుతో కొత్త విధానం అమలు చేయనుంది. సంతానోత్పత్తిని పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.
ఈ నూతన పాలసీలో భాగంగా.. ఇకపై ప్రతీ ఏటా 50 వేల మంది దంపతులకు ఉచితంగా ఐవీఎఫ్ చేయించనున్నారు. నిరుపేద దంపతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పలు కారణాల వల్ల సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఇది పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. ప్రస్తుతం బయట ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సకు రూ.లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇది పేదలకు పెను భారంగా మారింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఇకపై వారికి ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందించేందుకు నిర్ణయించింది. దీని వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జననాల రేటు అనేది తగ్గుతుంది.
ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి తగ్గిపోయింది. ఇది 2.1 శాతంగా ఉండాల్సి ఉండగా.. ప్రతి ఏటా పడిపోతూ వస్తుంది. దీంతో సంతానోత్పత్తి పెంచేందుకు పిల్లల సంపద పేరుతో ప్రతీ నెలా నాలుగో శనివారం గ్రామ సభలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మహిళా ఉద్యోగులకు 12 నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నారు. ఇక మహిళల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలు ఈ పాలసీలో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే వృద్ధుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2036 నాటికి ఏపీలో వృద్ధుల జనాభా 19 శాతానికి చేరుకుంటుందనే అంచనాలు వస్తున్నాయి. దీంతో వృద్ధుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
