Liquor Scam Chevireddy : ఏపీ మద్యం స్కాములో కీలక పరిణామం.. విచారణకు చెవిరెడ్డి భార్య, కొడుకులు

Liquor Scam Chevireddy : ఏపీ లిక్కర్ స్కాం విచారణలో కీలక పరిణామం చేసుకుంది.

ap liquor scam ed investigate ycp leader chevireddy wife and sonsover notices

  • ముగిసిన ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ
  • నేడు చెవిరెడ్డి కుటుంబాన్ని విచారించిన ఈడీ
  • సుమారు 4 గంటల పాటు సాగిన దర్యాప్తు

Liquor Scam Chevireddy : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా నేడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, ఆయన ఇద్దరు కుమారులు విచారణకు హాజరయ్యారు. ఈ కుంభకోణంలో పెద్ద మొత్తంలో మనీలాండరింగ్, హవాలా మార్గాల ద్వారా భారీగా నిధులు చేతులు మారాయనే ఆరోపణలపై దృష్టి సారించిన ఈడీ.. గతంలోనే చెవిరెడ్డి భార్య, ఇద్దరు కుమారులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు వీరు విచారణకు హాజరయ్యారు.

మద్యం ముడుపులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39గా మోహిత్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో రూ.63.72 కోట్ల విలువైన ఆస్తులను చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేయించినట్లు గుర్తించిన ఈడీ.. దీని గురించి వారిని ప్రశ్నించింది. 2021 నుండి 2023 వరకు రూ.63 కోట్ల ఆస్తులు కొనుగోలు చేయగా.. రికార్డుల్లో మాత్రం రూ.8.85 కోట్లు మాత్రమే చూపించినట్లు సిట్ (SIT) తేల్చింది.

KVS ఇన్‌ఫ్రా డబ్బులు రూటింగ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ.. చెవిరెడ్డి భార్య, కుమారులను ప్రశ్నించింది. 2019 నుండి 2024 మధ్య జరిగిన లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. సుమారు నాలుగు గంటల పాటు చెవిరెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మ, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను ఈడీ విచారించింది.

మద్యం వ్యాపారాలు, లైసెన్సుల కేటాయింపుల వ్యవహారంలో చెవిరెడ్డి భార్య పేరిట భారీ ఎత్తున అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. అలాగే ఈ కేసులో మరికొందరు రాజకీయ ప్రముఖులు, అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో, తాజా ఈడీ విచారణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.