AP SAEL Solar Project : కడపలో రూ.3 వేల కోట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్.. వారికి శిరస్సు వంచి నమస్కరించిన నారా లోకేష్
SAEL Solar Project : ఏపీలో మరో ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. రూ.3 వేలకు పైగా కోట్లతో కడప, జిల్లాలో నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
- Dharani Pilli
- Updated on- May 22, 2026 / 05:39 PM IST
ap minister nara lokesh at sael solar project in kadapa jammalamadugu inaguration
SAEL Solar Project: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం, టి.కొండూరు గ్రామంలో సుమారు రూ. 3,000 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన ప్రముఖ సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) సంస్థకు చెందిన 600 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ (సోలార్) ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు:
ఈ భారీ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటులో స్థానిక రైతుల త్యాగం, యువకుల ప్రోత్సాహం మరువలేనిదని మంత్రి లోకేష్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ తోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. సోలార్ కంపెనీ ఇక్కడి దాకా చేరింది అంటే దానికి రైతులే కారణమని చెబుతూ.. ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన అన్నదాతలకు ఆయన శిరస్సు వంచి నమస్కరించారు.
Also Read: ఏపీ వాసులకు శుభవార్త.. ఇకపై నిషేధిత జాబితాలో ఉన్న స్థలాల్ని సులభంగా అమ్ముకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. “జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి బ్రాండ్ మీది భయ్యా” అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని ‘రతనాల సీమ’గా మార్చడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ప్రకటించారు.
‘నమో’ అంటే నాయుడు జీ.. నరేంద్ర మోడీ జీ!
“పక్క రాష్ట్రంలో ‘నమో’ అంటే కేవలం నరేంద్ర మోడీ అని అర్థం.. కానీ ఏపీలో మాత్రం ‘నమో’ అంటే నాయుడు జీ, నరేంద్ర మోడీ జీ” అని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ విధానాల కొనసాగింపు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగ కల్పన చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఈ ఆశయ సాధనలో ప్రజలందరూ సహకరించాలని కోరారు.
జమ్మలమడుగులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్:
జమ్మలమడుగు ప్రాంతంలో ‘సోలార్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని లోకేష్ వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, అలా కంపెనీలు వచ్చినప్పుడు వాటిని మనస్ఫూర్తిగా ఆహ్వానించి ప్రోత్సహించాలే తప్ప, ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని సూచించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, ఆ డబ్బుతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు.
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘గూగుల్’ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అనంతరం, రాష్ట్రాన్ని నమ్మి ఎన్నో కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని లోకేష్ తెలిపారు. తన ‘యువగళం’ పాదయాత్రలో ఎక్కువ భాగం రాయలసీమ ప్రాంతంలోనే జరిగిందని గుర్తుచేసుకుంటూ.. ఆ పాదయాత్ర ద్వారా ఇక్కడి ప్రజల కష్టాలను, అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
