AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల రచ్చ.. అర్ధరాత్రి వరకు బాబుతో పవన్, బీజేపీ నేతల భేటీ.. త్వరలోనే అధికారిక ప్రకటన!
ఏపీ స్థానిక ఎన్నికల (AP Local Elections)సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో జనసేన, బీజేపీ నేతలు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
- V Santhosh Kumar
- Updated on- October 15, 2026 / 08:17 AM IST
Ap nda coalition seat sharing talks completed for local body elections
AP Local Elections: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో(AP Local Elections) అధికార కూటమి భాగస్వామ్య పక్షాలు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. విజయవాడ/అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో జనసేన, బీజేపీ అగ్రనేతలు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సమావేశమై సీట్ల సర్దుబాటు అంశంపై తీవ్రస్థాయిలో మంతనాలు జరిపారు. ఏ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలి, బలం ఎక్కడ ఎక్కువగా ఉందనే సమీకరణాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేసి, వచ్చే ఎన్నికల్లో కూటమి విజయాన్ని ఏకపక్షం చేయడమే లక్ష్యంగా నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు.
4 కార్పొరేషన్లు, 20కి పైగా మున్సిపాలిటీలపై జనసేన దృష్టి:
ఈ చర్చల్లో జనసేన పార్టీ విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, ఏలూరు కార్పొరేషన్లతో పాటు పిఠాపురం, తెనాలి, భీమవరం, అమలాపురం, శ్రీకాళహస్తి సహా 20కి పైగా మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపింది. అంతేకాకుండా పాలకొండ, నెల్లిమర్ల, ముమ్మిడివరం, మడకశిర నగర పంచాయతీల్లో పోటీ అంశంపై చర్చ సాగింది. పార్టీ బలం ఉన్న ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకునేలా జనసేన నేతలు తమ ప్రతిపాదనలను ఉంచారు.
రాజమండ్రి కార్పొరేషన్పై బీజేపీ కన్ను.. త్వరలోనే తుది ప్రకటన:
మరోవైపు బీజేపీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు యలమంచిలి, బాపట్ల, ఎర్రగుంట్ల, గూడూరు మున్సిపాలిటీల్లో పోటీ చేసే అంశంపై చర్చించింది. శ్రీకాళహస్తి స్థానం కోసం జనసేన, బీజేపీ రెండూ పోటీ పడుతుండటంతో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో చిన్నపాటి సవరణల అనంతరం తుది నిర్ణయానికి వచ్చి సీట్ల కేటాయింపుపై కూటమి నేతలు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
