AP Police Must Tackle Political Guerilla Warfare In State : రాష్ట్రంలో దేవాలయాల విషయంలో జరుగుతున్న రాజకీయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ జరుగుతోందని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే గుళ్లపై దాడులు చేస్తున్నారని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం విమర్శించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారని జగన్ ఆరోపించారు.
ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు పట్టుకునే పరిస్థితులు పోయి.. గుళ్లలో రాజకీయ దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాల్లో అర్ధరాత్రి పూట అందరూ పడుకున్నాక ఉద్దేశపూర్వకంగా గుళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మత, కులాల మధ్య విద్వేషాలు పెంచేవారిపట్ల పోలీసుల కఠినంగా వ్యవహరించాలని జగన్ ఆదేశించారు. ఇలాంటి ఘటనల్లో ఎవ్వరినీ లెక్క చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఈ రాజకీయ గొరిల్లా వార్‌ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఆలయాల వద్ద ఇప్పటివరకూ 36వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలన్నారు. ఆలయాలపై దాడుల అంశంపై లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎన్నెన్ని పెట్టగలం.. ఎక్కడని సీసీ కెమెరాలను పెట్టగలం.. గుళ్లపై దాడులు చేయాలంటేనే భయపడేలా చేయాలని పోలీసులను సీఎం జగన్ ఆదేశించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.