AP Weather Report : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. భీకరగాలులు.. హెచ్చరికలు జారీ..
AP Weather Report Today : ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి.. 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- August 13, 2026 / 07:29 AM IST
Andhra pradesh weather update
- ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్
- బంగాళాఖాతంలో వాయుగుండం
- కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు
AP Weather Report Today : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతుండగా.. పలు ప్రాతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా.. వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి.. 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఏపీలో ఈనెల 18వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వాతావరణ అంచనా ప్రకారం.. ఇవాళ (గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. ఆగస్టు 15 (శనివారం), 16 (ఆదివారం) కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో గంటకు 30-40 కి.మీ వేగంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైతులు కొంత ఆందోళనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో కాస్త ఆనందం వ్యక్తమవుతోంది. దీంతో పూర్తిస్థాయి సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు.
ఇదిలాఉంటే.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఆ సమయాల్లో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
