AP Weather Update : ఏపీ తీరానికి తుఫాను టెన్షన్.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు.. అక్టోబర్ 28న ఏం జరగబోతోంది?
AP Weather Update : ఆంధ్రప్రదేశ్ తీరానికి అతి తీవ్ర తుఫాను ముప్పు పొంచి ఉంది. అక్టోబర్ 28న తుఫాను తీరం దాటే అవకాశం, గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు, ఏపీలో భారీ వర్షాలపై IMD తాజా అంచనాలు తెలుసుకోండి.
- Sreehari A
- Updated on- October 25, 2026 / 07:11 PM IST
Andhra Pradesh Weather Alert
- బంగాళాఖాతంలో బలపడుతున్న తుఫాను.. ఏపీ ప్రజలు అలర్ట్
- గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు? ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక
- ఏపీపై తుఫాను ఎఫెక్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాల సూచన
AP Weather Update : ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బలపడుతున్న వాయుగుండం.. :
వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం.. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. అక్టోబర్ 26 తెల్లవారుజామునాటికి తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 27 నాటికి తీవ్ర తుఫానుగా, ఆ తర్వాత అతి తీవ్ర తుఫానుగా బలపడే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
అక్టోబర్ 28న తీరం దాటే అవకాశం :
ప్రస్తుత అంచనాల ప్రకారం.. అక్టోబర్ 28, 2026న ఉదయం నుంచి మధ్యాహ్నానికి ముందు సమయంలో బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాల సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. అయితే, తుఫాను ప్రయాణ దిశ, తీవ్రతలో మార్పులు ఉండవచ్చు..
తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి. అత్యవసర వస్తువులు రెడీగా పెట్టుకోవడం, బలమైన గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండొద్దు. తుఫాను దిశ, వర్షాల తీవ్రతకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
