APSDMA రెడ్ అలర్ట్.. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన… రాబోయే 3 గంటలు బయటకు రావొద్దు

APSDMA Red Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

APSDMA Issue red alert for moderate to heavy rains in krishna ntr west godavari eluru

APSDMA Red Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని.. కనుక ఆయా జిల్లాల ప్రజలు రాబోయే మూడు గంటల వరకు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచిస్తున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాల వల్ల.. ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉన్నందున, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విన్నవించారు.

ఇదిలా ఉంటే.. ఏపీలోని మార్కాపురంలో బుధవారం సాయంత్రం.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అలానే కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షాలతో కోత దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల మండలంలోని పలు ప్రాంతాలలో బుధవారం ఒక్కసారిగా వడగండ్ల వాన కురిసింది. దీంతో పాటు ఉంగుటూరు, ఘంటసాల, కంకిపాడులో చిరుజల్లులు కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మారిన వాతావరణంతో కోత దశలో ఉన్న మిరప, మినుము, పెసర తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంట నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.