APSRTC Home Pickup: ఇక బస్టాప్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు.. RTC బంపర్ ఆఫర్
ఏపీఎస్ఆర్టీసీ (APSRTC Home Pickup) తన ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
APSRTC to offer home pickup for bulk ticket booking.
- ఇంటి వద్దకే రానున్న బస్సు
- 10 టికెట్లు బల్క్ బుకింగ్
- తొలుత విజయవాడలో పైలట్ ప్రాజెక్ట్
APSRTC Home Pickup: ఏపీఎస్ఆర్టీసీ తన ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. బస్సు ఎక్కడానికి ఇకపై ప్రయాణికులు బస్టాండ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటి వద్దకే(APSRTC Home Pickup) బస్సు వచ్చేలా ప్రత్యేక పికప్ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఒకేసారి 10 లేదా అంతకంటే ఎక్కువ బల్క్ టికెట్లు బుక్ చేసుకునే వారి ఇళ్లకు నేరుగా బస్సు వచ్చి పికప్ చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది.
తొలుత విజయవాడలో పైలట్ ప్రాజెక్ట్:
ఈ వినూత్న విధానాన్ని ఏపీఎస్ఆర్టీసీ తొలుత విజయవాడ రీజియన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. విజయవాడలో సాధ్యాసాధ్యాలు, సమస్యలను పరిశీలించిన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన ప్రధాన నగరాలకు దీనిని విస్తరిస్తారు. ప్రస్తుతానికి కేవలం దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, అమరావతి, గరుడ వంటి అగ్రశ్రేణి (హైఎండ్) బస్సులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
లగేజీ ఇబ్బందులకు చెక్:
కుటుంబ సమేతంగా లేదా సమూహాలుగా ప్రయాణించే వారికి, ఎక్కువ లగేజీ ఉన్నవారికి బస్టాండ్ వరకు వెళ్లే శ్రమ, సమయం ఆదా కానుంది. బల్క్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ముందుగా సమాచారం అందిస్తే బస్సు నేరుగా ఇంటి వద్దకే వస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక యాప్, అధికారుల సంప్రదింపుల వివరాలు, ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ఏపీఎస్ఆర్టీసీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
