School Holidays : అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
Arnab Cyclone Effect School Holidays In AP : తుపాను ప్రభావంతో నేడు (గురువారం) కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో గురువారం కూడా పలు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
- Harish Thanniru
- Updated on- October 29, 2026 / 07:20 AM IST
Arnab Cyclone Effect Holidays for Schools and colleges In AP on 29th
Arnab Cyclone Effect School Holidays In AP : అతి తీవ్ర తుపాను అర్నబ్ ఏపీలోని కోస్తా జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై విరుచుకుపడింది.
Also Read : అర్నబ్ ఎఫెక్ట్.. నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్.. ఏ పంటకు ఎంతంటే?
తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో పలు జిల్లాల్లో వేలాది వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు ప్రాంతాలు చీకట్లో ఉండిపోయాయి. ఈ తుపాను కారణంగా వేరువేరు ఘటనలో ఐదుగురు మరణించినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది.
బుధవారం ఉదయం నుంచి రాత్రి 8గంటల వరకు ఏలూరు జిల్లా నారాయణపురం ప్రాంతంలో 12.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలోని చల్లపల్లి ప్రాంతంలో 12.1సెం.మీ, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర ప్రాంతంలో 11.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులు (గురువారం, శుక్రవారం) పర్యటించనున్నారు.
తుపాను ప్రభావంతో నేడు (గురువారం) కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ప్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. దీంతో గురువారం కూడా పలు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు, కాాలేజీలకు సెలవులు ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సెలవులు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
