Bank Manager Abuse : లోన్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే.. నెల్లూరులో కీచక బ్యాంకు మేనేజర్
ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ కీచకపర్వం వెలుగు చూసింది. పర్సనల్ లోన్ల కోసం బ్యాంకుకి వచ్చే మహిళలే అతడి టార్గెట్. లోన్ల కోసం వచ్చే వారిపై కన్నేస్తాడు.
- Naveen
- Published On : July 3, 2021 / 03:19 PM IST
Bank Manager Abuse
Bank Manager : ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ కీచకపర్వం వెలుగు చూసింది. పర్సనల్ లోన్ల కోసం బ్యాంకుకి వచ్చే మహిళలే అతడి టార్గెట్. లోన్ల కోసం వచ్చే వారిపై కన్నేస్తాడు. రుణం కావాలంటే తనకు లొంగిపోవాలని ఒత్తిడి తెచ్చి లోబరుచుకుంటాడు.
అంతేకాదు గడువులోగా రుణాలు చెల్లించకపోతే మహిళా ఖాతాదారులను లైంగికంగా వేధిస్తున్నట్లు బయటపడింది. రుణాల కోసం వచ్చే మహిళలను ఆశ పెట్టి లొంగదీసుకుంటున్నాడు. మహిళల పట్ల మేనేజర్ వికృత చేష్టలు బయటపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆఫీసర్ ముసుగులో ఉన్న కామాంధుడు అతడు అని బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంకులోనే ఆ కీచక మేనేజర్ జరిపిన రాసలీలలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మహిళలను మేనేజర్ తన గదిలోకి పిలిచి వారి ఆర్థికావసరాలను ఆసరా చేసుకుని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. మహిళల ఫోన్ నెంబర్లు తీసుకుని వారిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కీచక మేనేజర్ వ్యవహారం తెలిసి ఒంటరిగా మహిళలు బ్యాంక్ మేనేజర్ గదిలోకి వెళ్లడానికే భయపడుతున్నారు.
బ్యాంకు మేనేజర్ నగేశ్ బ్యాంకులోనే అసభ్యంగా ప్రవరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. నగేశ్ అసభ్య ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రాసలీలల దృశ్యాలు మీడియాలో రావడంతో మేనేజర్ నగేష్ మెల్లగా జారుకున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు మేనేజర్ పై కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పరారీలో ఉన్న నగేష్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
