×
Ad

Adi Narayana Reddy: Adi Narayana Reddy: నా మాటల్లో తప్పేముంది? కులం గురించి మాట్లాడలేదు.. జగన్‌తో ప్రాణహాని ఉంది- బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి

నా వ్యాఖ్యలపై పార్టీ నన్ను వివరణ కోరేది ఏమీ లేదు. రకరకాలుగా తప్పు మాట్లాడా అంటున్నారు. నేను మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, నా మాటలను వక్రీకరించొద్దు.

  • Published On : February 10, 2026 / 09:02 PM IST

Adi Narayana Reddy Representative Image (Image Credit To Original Source)

  • నేను నాలుగోసారి ఎమ్మెల్యే, నా సొంత అభిప్రాయం తెలిపా
  • నా మాటలను వక్రీకరించొద్దు
  • చంద్రబాబుకు తెలియకుండా మాదే రాజ్యం అని కొందరు అనడం కరెక్ట్ కాదు
  • నేను కులం గురించి మాట్లాడాను అని ఎవరైనా అంటే చాలా తప్పు

Adi Narayana Reddy: కూటమి పాలనలో కమ్మతనం పోవాలి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో పెను దుమారం రేపాయి. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. దీంతో ఈ వ్యవహారంపై ఆది నారాయణ రెడ్డి స్పందించారు. నేను నాలుగోసారి ఎమ్మెల్యే అన్న ఆయన తన సొంత అభిప్రాయం వ్యక్తం చేశానని వివరించారు. తాను ప్రాస బాగా మాట్లాడతానని, అందులో భాగంగానే అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో కమ్మతనం ప్రస్పుటంగా ఉందని చెప్పా, అందులో తప్పు ఏముంది? అని ఆయన ప్రశ్నించారు.

”ప్రస్పుటంగా అంటే సున్నితంగా ఉందని మాత్రమే చెప్పా. నా ప్రాసను ప్రయాసగా మార్చారు. చంద్రబాబుకు తెలియకుండా మాదే రాజ్యం అని కొందరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు. కులాలు, మతాలు ఈ మధ్యలో వచ్చాయి. నేను ఒక కులం గురించి అస్సలు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. నేను కులం గురించి మాట్లాడాను అని ఎవరైనా అంటే మాత్రం చాలా తప్పు. నా వ్యాఖ్యలపై పార్టీ నన్ను వివరణ కోరేది ఏమీ లేదు. రకరకాలుగా తప్పు మాట్లాడా అంటున్నారు. నేను మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, నా మాటలను వక్రీకరించొద్దు.

కమల వికాసాన్ని మనసులో పెట్టుకుని నేను మాట్లాడా. లడ్డూలో జంతువుల కొవ్వు కంటే జగన్ కొవ్వు కరగదియ్యాలి. జగన్ తో నాకు ప్రాణహాని ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో సునితమ్మకు ప్రాణహాని ఉంది. చరిత్ర చదవండి. కులం మతం ఎక్కడ నుంచి వచ్చాయి. ఈ మధ్యలోనే వచ్చాయి. కమ్మని సమాజం అంటే బలమైన సమాజం, ఒకటే సమాజం అని నా ఉద్దేశ్యం. నేను సీనియర్ ఎమ్మెల్యేని. వివరణలు, సవరణలు, విశ్లేషణలు ఏమీ ఉండవు. కమ్మటి రాజ్యం అంటే సమర్ధవంతంగా ఉండాలి అనేది నా ఉద్దేశ్యం. నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి” అని ఆదినారాయణరెడ్డి అన్నారు.

Also Read: కూటమి పాలనలో కమ్మతనం పోవాలి..! బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?