బతికించండి సార్.. దండం పెడతా.. పోలీసులను వేడుకున్న రాప్తాడు నిందితుడు.. అస్పత్రిలో ప్రస్తుతం అతని పరిస్థితి ఇదే.. వీడియో వైరల్
Rapthadu Girl Attack Case : శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడిచేసిన ఉన్మాది హేమంత్ పై పోలీసుల బృందం కాల్పులు జరిపింది.
- Harish Thanniru
- Updated on- November 2, 2026 / 11:15 AM IST
Rapthadu Girl Attack Case
Rapthadu Girl Attack Case : శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు జడ్పీహెచ్ఎస్లో శనివారం పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడిచేసిన ఉన్మాది హేమంత్ పై పోలీసుల బృందం కాల్పులు జరిపింది. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసులు అంబులెన్సులో అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు.
నిందితుడు హేమంత్ ఆత్మకూరు అడవిలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపులు చేపట్టారు. పొదల్లో దాక్కున్న నిందితుడిని పట్టుకొనే ప్రయత్నలో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో రాప్తాడు సీఐ వెంకటేష్ భుజం భాగంలో తీవ్రగాయమైంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినా నిందితుడు వినకపోవటంతో మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో నిందితుడు ఎదురుదాడికి ప్రయత్నించడంతో పోలీసులు అతని కాళ్లపై కాల్పులు జరిపారు. ఆరు బెల్లెట్లు అతని రెండు కాళ్లలోకి దూసుకెళ్లాయి. ఆ తరువాత నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చారు.
తీవ్ర గాయాలతో చావుబతుకుల్లో ఉన్న నిందితుడు.. ఆస్పత్రికి తరలించే సమయంలో తనను బతికించాలని పోలీసులు వేడుకున్నాడు. రికవరీ చేయించండి సార్ అంటూ బ్రతిమాలాడాడు. మరోవైపు.. నిందితుడిపై కాల్పులు జరపడంతో బాధిత విద్యార్థిని స్వగ్రామం అయ్యవారిపల్లి ప్రజలు హర్షం వ్యక్తంచేస్తూ గాలిలోకి టపాసులు కాల్చి అనందం వ్యక్తం చేశారు. పోలీస్ జిందాబాద్ అంటూ రాప్తాడులోనూ ప్రజలు నినాదాలు చేశారు.
ఇదిలాఉంటే.. నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఆరు రౌండ్లు అతని రెండుకాళ్లపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఒక కాలుకు నాలుగు బుల్లెట్లు, మరో కాలికి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలిసింది. శస్త్ర చికిత్స నిమిత్తం కాలును తొలగించినట్లు సమాచారం. అయితే, కొద్దిసేపటి తరువాత నిందితుడికి సంబంధించిన పూర్తిస్థాయి హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేసే అవకాశం ఉంది.
