Chandrababu: ”నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని, నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం”.. కర్నూలులో చంద్రబాబు ఉగ్రరూపం

వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. హెచ్చరికలతో ఉగ్రరూపం చూపించారు. నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని అంటూ నిప్పులు చెరిగారు.

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఇవాళ కర్నూలులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తాకింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు అడుగడుగునా ప్రయత్నించాయి. రాయలసీమకు న్యాయ రాజధాని కావాల్సిందేనంటూ చంద్రబాబు పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి.

చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు బస చేసిన మౌర్య ఇన్ హోటల్, చంద్రబాబు వెళ్లిన మెడికల్ కాలేజీ, టీడీపీ ఆఫీస్, టిడ్కో ఇళ్ల దగ్గర.. ఇలా చంద్రబాబు కాన్వాయ్ ఎటు వెళ్తే అటు నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్ ను ప్రతీచోట అడ్డగించారు. వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. హెచ్చరికలతో ఉగ్రరూపం చూపించారు. కర్నూలు టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి? అంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి తాను సిద్ధమన్నారు చంద్రబాబు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి… పనికిమాలిన దద్దమ్మల్లారా! అంటూ విరుచుకుపడ్డారు. జగనే రాయలసీమ ద్రోహి అని ఎదురుదాడికి దిగారు. రాయలసీమను దోచుకునే శక్తి వైసీపీకి ఉందని, రాయలసీమను సస్యశ్యామలం చేసే శక్తి టీడీపీకే ఉందని చంద్రబాబు చెప్పారు. రాయలసీమను తాము రతనాల సీమ చేస్తే, జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం తలపెడుతున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

“విశాఖ వెళ్లి ఉత్తరాంధ్ర వాళ్లను రెచ్చగొడతావు, రాయలసీమ వచ్చి ఇక్కడి వాళ్లను రెచ్చగొడతావు. మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి చలికాచుకునే నువ్వు రాజకీయం చేస్తావా? ఇదేం పులివెందుల అనుకుంటున్నావా.. తరిమి తరిమి కొట్టిస్తా. వైసీపీ గూండాలు ఒకటే గుర్తుపెట్టుకోండి.. బట్టలిప్పి కొట్టిస్తా. మర్యాదకు మర్యాద.. దెబ్బకు దెబ్బ.

ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలైనా ఇస్తా. బాంబులకే భయపడలేదు. నాపైనే దాడి చేయాలనుకుంటున్నారు. మా కార్యకర్తలకు నేను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారు. తమ్ముళ్లూ… నన్ను రెచ్చగొడుతున్నాడు.. నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం! నేను ఎవరికీ భయపడను.. ఒక్క ప్రజలకు తప్ప. నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని” అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.