CII Summit 2026 : ఏపీకి పెట్టుబడుల జాతర.. రూ.9.89 లక్షల కోట్లతో భారీ డీల్స్.. ఉద్యోగాలపై చంద్రబాబు కీలక ప్రకటన!

CII Summit 2026 : విశాఖ సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 303 ఎంఓయూలు, 19.3 లక్షల ఉద్యోగాల లక్ష్యం, కియా విస్తరణతో పాటు చంద్రబాబు కీలక ప్రకటనలివే..

CII Summit 2026

  • ఏపీలో రూ.9.89 లక్షల కోట్లతో CII సమ్మిట్‌లో భారీ ఒప్పందాలు
  • శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు..
  • ఏపీకి క్యూ కట్టిన దేశ, విదేశీ కంపెనీలు
  • ఏపీలో పెట్టుబడులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CII Summit 2026 : ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సమ్మిట్‌లో భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. క్లీన్ ఎనర్జీ నుంచి డేటా సెంటర్ల వరకు.. తయారీ రంగం నుంచి పర్యాటకం వరకు అన్ని రంగాల్లో పెట్టుబడులకు మార్గం సుగమమైంది..

రాష్ట్రానికి రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు :
ఈ సమ్మిట్‌లో మొత్తం 303 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఒప్పందాల ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

19.3 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం :
కేవలం ఈ రెండు రోజుల సదస్సుకే పరిమితం కాకుండా.. గత రెండున్నరేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను కూడా చంద్రబాబు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రూ.32.49 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని, ఇందులో రూ.17.1 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయని చెప్పారు. మొత్తం 714 ప్రాజెక్టుల ద్వారా 19.3 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని వివరించారు.

Read Also : CM Revanth Reddy : భారత్ సమ్మిట్‌పై విపక్షాల విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్!

పరిశ్రమల విస్తరణపై ఫోకస్ :

ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కియా సంస్థ అనంతపురంలో రూ.18,878 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది. తద్వారా 12 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అనంతపురంలో రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తెలిపారు.

మరోవైపు ఏపీలో రహదారులు, పోర్టుల అభివృద్ధిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌వే, రాయ్‌పూర్-విశాఖ కారిడార్ వంటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. మరిన్ని కారిడార్లు, పోర్టుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

సినీ పరిశ్రమపై చర్చ :
ఏపీకి సినీ పరిశ్రమను తీసుకొచ్చే అంశం కూడా చర్చకు వచ్చింది. మంత్రి నారా లోకేష్, సినీనటుడు రానా మధ్య దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రయత్నిస్తున్నామని లోకేష్ చెప్పగా, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని రానా తెలిపారు.

పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన, సినీ పరిశ్రమ.. ఇలా పలు రంగాల్లో ఏపీ భవిష్యత్తుపై విశాఖ సీఐఐ సమ్మిట్‌లో కీలక చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ ఒప్పందాల్లో ఎన్ని త్వరగా కార్యరూపం దాలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది..