CM Chandrababu Naidu : అసెంబ్లీకి రండి.. సాక్ష్యాలతో సమాధానం ఇస్తాం.. డీఎస్సీ వివాదంపై సీఎం చంద్రబాబు.. టీచర్లపై దాడుచేస్తే ఊరుకోమంటూ హెచ్చరిక

CM Chandrababu Naidu : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడులు చేయడం సరికాదని, టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై కొనసాగుతున్న వివాదం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనలు చేపడుతుండగా.. తమ నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమవారం ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Also Read : Tank Bund Protest: ట్యాంక్ బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఉత్సవ సమితి నేతల అరెస్ట్.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం బహిరంగ సభలో స్పందించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడులు చేయడం సరికాదని ఆయన అన్నారు. టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫేక్ పార్టీ అందరినీ ఫేక్ అంటే సహించేది లేదని విజయవాడలో స్పోర్ట్స్ టీచర్లు ఆందోళన చేస్తున్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ కష్టార్జితంతో ఉద్యోగాలు సాధించామని చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. చట్టబద్ధమైన నియామకాలపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని, దాడులకు పాల్పడటం మాత్రం సరికాదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

డీఎస్సీ నియామకాల విషయంలో అవినీతికి తావులేదని చంద్రబాబు పేర్కొన్నారు. తన హయాంలో పేపర్ లీక్ వంటి ఘటనలు జరగలేదని అన్నారు. టీచర్ల నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయడం తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డుగా పేర్కొన్నారు. నియామకాలు పూర్తయిన ఏడాది తర్వాత ఇప్పుడు లేనిపోని ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆరోపణలు చేసేవారు అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో సమాధానం ఇస్తామని అన్నారు.

గత ప్రభుత్వ పాలనపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 2019–24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. పాలకులే రౌడీయిజానికి పాల్పడ్డారని విమర్శించారు.

కుప్పంలో తనను కూడా గతంలో ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్న చంద్రబాబు.. రౌడీయిజం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, విధ్వంసక చర్యలను సహించబోమని చెప్పారు. రౌడియిజం చేసే వారి తోక కత్తిరిస్తాం. రౌడీలను విధ్వంసకారులను తరిమి కొట్టే సత్తా కుప్పానికి ఉంది. ప్లెక్సీలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రక్తాభిషేకం చేస్తున్న వారిని సైకోలు అనాలా..? మానసిక రోగులు అనాలా..? అంటూ చంద్రబాబు వైసీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తిరుమల పవిత్ర లడ్డూను కూడా కల్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికలోనూ టీడీపీకి మద్దతుగా నిలిచిన నియోజకవర్గాల్లో కుప్పం, హిందూపురం ముందున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.