CM Chandrababu : మహిళా బిల్లును అడ్డుకోవటం క్షమించరాని నేరం.. నిడదవోలు ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు
CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
- Harishth Thanniru
- Published on- April 18, 2026 / 02:03 PM IST
CM Chandrababu Naidu
CM Chandrababu : రిజర్వేషన్లు వస్తాయని మహిళలు ఆశపడ్డారు.. కానీ, పార్లమెంట్‌లో కాంగ్రెస్, మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్రోహమంటూ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో కాంగ్రెస్, మిత్రపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మహిళలను గౌరవించి.. అన్నిరంగాల్లో ఆదరించడం మన సంస్కృతి. సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. మహిళా లోకమంతా ఏకమైందని చంద్రబాబు అన్నారు. మహిళల రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవడం క్షమించరాని నేరం. విపక్ష పార్టీలు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయి. దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం స్పష్టత ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో కూటమి నేతలు బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్, జనసేన నేత, మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
