Cyclone Arnab : ‘అర్నబ్’ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం.. వారందరికీ పరిహారం.. ఆ కుటుంబాలకు రూ. 5లక్షలు

Cyclone Arnab : కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వాతావరణం అనుకూలించక సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. రెండు జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్‌ పునరుద్ధరిస్తాం. గురువారం సాయంత్రం వరకు శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

CM Chandrababu

Cyclone Arnab : అర్నబ్ తుఫాను ప్రభావాన్ని సాంకేతికత సాయంతో ముందుగానే అంచనా వేసి, అందుకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐఎండీతో పాటు ఇతర ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తుఫాను తీవ్రత, ప్రభావిత ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. సముద్రంలో వివిధ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీ తీరంపై తుఫాను 10 గంటలపాటు నిలిచి పోయింది. నిన్న రాత్రి 11.15గంటలకు తుపాను తీరందాటింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుఫాను కారణంగా లోటు వర్షపాతం 12 శాతం మేర తగ్గిందని తెలిపారు.

Also Read : Cm Chandrababu: ‘అర్నబ్’ తుపానుతో ఏపీకి భారీ నష్టం.. వెంటనే కేంద్ర బృందాలను పంపండి.. అమిత్‌షాకు చంద్రబాబు కీలక లేఖ

తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు, ముందస్తు చర్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క చెరువుకు కూడా గండిపడలేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అయితే తుఫాను కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని, సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయని తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వాతావరణం అనుకూలించక సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. రెండు జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్‌ పునరుద్ధరిస్తాం. గురువారం సాయంత్రం వరకు శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో తుపానుల వల్ల చాలామంది చనిపోయేవారు. కానీ ఈ తుపాను ప్రభావంతో ఐదుగురే చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.  ఈ తుపాను కారణంగా అనకాపల్లి జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, కోనసీమ జిల్లాలో ఇద్దరు మృతి చెందారని సమాచారం ఉంది.

పరిహారం ఇలా.. 
♦ తుపాను మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం
♦ ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం
♦ శిబిరాల్లోని బాధితులకు రూ. వెయ్యి చొప్పున రూ. 3వేల వరకు సాయం
♦ కిరాణా, దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బతింటే రూ. 25వేలు
♦ రూ.40లక్షలలోపు టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.50వేలు
♦ రూ. 40లక్షల నుంచి రూ. కోటిన్నరలోపు టర్నోవర్ ఉన్న వాటికి రూ.లక్ష
♦ రూ. కోటిన్నరకు పైగా టర్నోవర్ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.1.5లక్షల సాయం
♦ ద్విచక్ర వాహనం దెబ్బతింటే రూ. 3వేలు
♦ త్రిచక్ర వాహనానికి రూ.10వేలు సాయం
♦ దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లకు రూ.9వేలు
♦ వలల మరమ్మతులకు రూ.5వేలు
♦ వలలు ఉండి దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లకు రూ.25వేలు సాయం