తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఇది పాటించాలంటూ చంద్రబాబు సంచలన ట్వీట్
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : September 27, 2024 / 02:58 PM IST
AP CM Chandrababu
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల తిరుపతి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ట్వీట్ చేస్తూ తిరుమల తిరుపతికి వెళ్లే వారి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది.
తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది.
శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నాను. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
