Cm Chandrababu: జీవితంలో ప్రజల భూమిపై ఇతరులు ఎవరూ కూడా కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రజల భూముల రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరని చంద్రబాబు తేల్చి చెప్పారు. భూ రికార్డులను ట్యాంపర్ చేస్తే జైలుకి పంపేలా చట్టం తెచ్చామన్నారు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. ఏపీని భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు చంద్రబాబు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతులతో సమావేశం అయ్యారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చామని తెలిపారు. స్కూల్ కి వెళ్లినా, పొలానికి వెళ్లినా ఆయన ఫొటోలే ఉన్నాయని మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. మీ తాత ఇచ్చారా? మీ తండ్రి ఇచ్చారా? ప్రజల భూములపై మీ ఫోటోలు ఏంటి? అని చంద్రబాబు నిలదీశారు. వారసత్వంగా వచ్చిన భూమిపై ఫోటో వేసుకోవడానికి మీరెవరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది శాడిజం కాకపోతే ఇంకేమంటారు? అని ధ్వజమెత్తారు. నా జీవితంలో ఎప్పుడూ చూడనన్ని భూ సమస్యలను ఇప్పుడు చూస్తున్నా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. క్యూఆర్ కోడ్ పెట్టామన్న చంద్రబాబు.. క్యూఆర్ కోడ్ తో ఎప్పుడైనా మీ భూమిని చూసుకోవచ్చని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని తెచ్చామన్న చంద్రబాబు.. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. వీటిని ఎవరైనా ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే పంపుతామని హెచ్చరించారు. త్వరలో మరిన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. 1.30 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయని వెల్లడించారు.
”ప్రజల భూమిని ప్రభుత్వ భూమిగా మార్చారు. వ్యక్తిగత స్వార్ధాల కోసం రికార్డులను అస్తవ్యస్తం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య తెస్తే తాట తీస్తా. ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకం మీకు ఇవ్వడమే నా ధ్యేయం. ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. క్యూఆర్ కోడ్ తో ప్రజల భూమికి రక్షణ కల్పించాం. ఎవరూ ట్యాంపర్ చేయకుండా సిస్టమ్ తీసుకొచ్చాం. భూపత్రాలు ఎవరైనా ట్యాంపర్ చేస్తే జైలుకి పంపుతాం. పీడి యాక్ట్ పెడతాం. మేము ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయలేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ప్రతీ దానిపై ఫోటో వేయించుకున్నారు. ఇది శాడిజమా? కాదా?” అని ఫైర్ అయ్యారు చంద్రబాబు.