Visakhapatnam: అప్పుడెప్పుడో ఐదేళ్ల పాటు గ్రేటర్ విశాఖ పీఠాన్ని శాసించింది టీడీపీ. మరోసారి ఫుల్ టర్మ్ వైజాగ్ నగరాన్ని పాలించాలనేది తెలుగు తమ్ముళ్ల కల. దాంతో మొన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కన్నేసింది కూటమి. వైసీపీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి నాలుగు దశాబ్ధాల కలను నెరవేర్చుకుంది టీడీపీ. కొత్త మేయర్ పదవీకాలం మార్చితో ముగియనుంది. దీంతో ఇప్పటినుంచే వైజాగ్ మేయర్ పీఠం కోసం రేసుగుర్రాల్లాగా పరిగెడుతున్నారు లీడర్లు.
అయితే విశాఖ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటికైతే పూర్తి క్లారిటీ లేదు. భీమిలీ, గాజువాక, అనకాపల్లి మునిసిపాలిటీల విలీనంతో 98 వార్డులతో రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న జీవీఎంసీలో..భీమిలీ, అనకాపల్లిలోని గ్రామీణ మండలాలను కూడా కలుపుతారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అవన్నీ జీవీఎంసీలో కలిస్తే మరో 25 వార్డులు పెరిగే అవకాశం ఉంది. జీవీఎంసీని 150 వార్డులకు పెంచాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.
జీవీఎంసీలో కొత్త ప్రాంతాలను కలుపుకుని ఎన్నికలు పెట్టాలంటే మరో ఆరు నెలలు సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగస్ట్ తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో అప్పటికీ విలీన ప్రాంతాలపై క్లారిటీ రావడంతో పాటు, ఓటర్ల జాబితా కూడా సిద్ధమవుతుందని, వార్డులను పెంచి ఎన్నికలు నిర్వహించొచ్చని చెబుతున్నారు.
Also Read: ఈ ప్రాంతాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలకు పట్టు దొరకట్లేదా?
ఈ క్రమంలో జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమిలో అప్పుడే చర్చ మొదలైంది. విశాఖ తొలి మేయర్ పీఠం బీజేపీ దక్కించుకుంది. 1987లో టీడీపీ గెలిచింది. 1995, 2005, 2007లలో వరసగా మూడుసార్లు కాంగ్రెస్ మేయర్ ఛైర్‌ను శాసించింది. 2021లో జరిగిన ఎన్నికలలో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. నాలుగేళ్ల పాటు మేయర్‌గా వైసీపీకి చెందిన హరి వెంకటకుమారి కొనసాగారు.
గతేడాది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెను గద్దె దించారు. టీడీపీకి చెందిన శ్రీనివాసరావు మేయర్ అయ్యారు. ఈ ఏడాది మార్చితో జీవీఎంసీ పదవీకాలం పూర్తి కాబోతోంది. ఓటర్ల తుది జాబితా మార్చి 9లోగా తయారు చేసి పంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.
దీంతో రాష్ట్రంలో కీలకమైన నగరంగా ఉన్న విశాఖ జీవీఎంసీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలని కూటమి పట్టుదలగా ఉంది. జీవీఎంసీ మేయర్ పీఠం కోసం టీడీపీలో రేసే బానే ఉంది. ప్రస్తుత మేయర్ శ్రీనివాసరావు మరోసారి మేయర్ సీటును ఆశిస్తున్నారు. బలమైన గవర సామాజికవర్గానికి చెందిన ఆయన విశాఖలో తమ సామాజికవర్గం అండదండలతో పీఠాన్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
నేతల్లో ఆశలు
విశాఖలో యాదవ సామాజికవర్గం కూడా పెద్ద సంఖ్యలో ఉంది. పైగా అవిశ్వాసం పెట్టి వైసీపీకి చెందిన యాదవ సామాజికవర్గం మహిళను తొలగించారని, టీడీపీలో తమ సామాజికవర్గానికి మేయర్ పదవి కేటాయించాలని కోరుతున్నారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పట్టాభి మేయర్ కావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఆయన గతంలో జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. అలాగే కాపులు, మత్స్యకారులు, నాగవంశీయుల నుంచి కూడా మేయర్ పీఠానికి తెలుగుదేశంలో పోటీ ఉంది.
ఇక కూటమిలో కీలకమైన మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా మేయర్ పీఠాన్ని ఈసారి పంచుకోవాలని చూస్తోంది. గతేడాది అవిశ్వాస తీర్మానం తర్వాత జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా అది ఇంప్లిమెంట్ కాలేదు. దాంతో ఈ సారి మేయర్ పీఠానికే జనసేనలోని కీలక నేతలు గురి పెడుతున్నారు.
విశాఖ నగరంలో పెద్ద సంఖ్యలో కాపులు ఉన్నారని..మేయర్ పదవిని రెండున్నరేళ్లు పంచుకునేలా ప్రతిపాదనలు పెట్టాలని అనుకుంటున్నారట. బీజేపీకి విశాఖ నగరంలో బలం ఉంది. ఆ పార్టీ కూడా డిప్యూటీ మేయర్ పదవులతో పాటు వీలైతే ఒక ఏడాది మేయర్ సీటు కోరే ఆలోచనలో ఉన్నారట. ఎక్కువ కార్పోరేటర్ సీట్లను తీసుకుని సంఖ్యాబలం పెంచుకోవాలని చూస్తోందట బీజేపీ. ఎన్నికలకు ముందే కూటమి పార్టీల్లో ఆశలు ఇలా ఉంటే..సీట్ల పంపకాలు, ఫలితాలు..తర్వాత మేయర్ రేసు ఎలా ఉంటుందో చూడాలి మరి.