Operation Firewall: ఏపీలో పాకిస్తాన్ స్పై నెట్‌వర్క్.. రంగంలోకి కౌంటర్ ఇంటెలిజెన్స్.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’తో ఇద్దరు అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడుస్తున్న పాకిస్తాన్ స్పై నెట్‌వర్క్ గుట్టును ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్(Operation Firewall) అధికారులు చేధించారు.

Counter-intelligence wing busts Pakistan spy network as part of 'Operation Firewall'

Operation Firewall: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడుస్తున్న పాకిస్తాన్ స్పై నెట్‌వర్క్ గుట్టును ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు ‘ఆపరేషన్ ఫైర్‌వాల్(Operation Firewall)’ పేరుతో చేధించారు. దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ, నేవీ సమాచారాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ గూఢచర్యంపై 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక సహా ఏకంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 18 మంది అనుమానితులను గుర్తించగా, వారిలో 13 మంది నేవీ సిబ్బంది ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.

Harish Rao: ఓపక్క కరెంట్ కోతలు.. మరోపక్క ఛార్జీల పెంపు.. కాంగ్రెస్ పాలనపై హరీష్ సంచలన కామెంట్స్

ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా రహస్య సమాచారం చేరవేత:

రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ ఛానళ్ల ద్వారా పాకిస్తానీ ఏజెంట్లకు చేరవేస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సోదాల్లో భాగంగా అనుమానితుల వద్ద నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. మొత్తం 18 మంది నెట్‌వర్క్‌లో ఇద్దరి పాత్రపై పక్కా ఆధారాలు లభించడంతో వారిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

రిమాండ్‌కు కాంట్రాక్ట్ డ్రైవర్.. విశాఖ జైలుకు తరలింపు:

అరెస్టయిన వారిలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాయివరప్రసాద్ ముఖ్యమైన పాత్ర పోషించినట్లు గుర్తించారు. న్యాయస్థానం అతనికి ఈ నెల 14వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో అధికారులు విశాఖపట్నం జిల్లా మధ్యంతర జైలుకు తరలించారు. ఈ స్పై నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమందికి భాగస్వామ్యం ఉందనే కోణంలో అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.