Arnab Cyclone Alert : అత్యంత తీవ్ర తుపానుగా ‘అర్నబ్’.. మూడ్రోజులు ఏపీలోని 12జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరిలకు జారీ..
Arnab Cyclone Alert : ఏపీపై ‘అర్నబ్’ తుపాన్ పంజా విసిరేందుకు సిద్ధమైంది. ఈ తుపాను కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యంత తీవ్ర స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
- Harish Thanniru
- Updated on- October 25, 2026 / 07:15 AM IST
Arnab Cyclone Alert
Arnab Cyclone Alert : ఏపీపై ‘అర్నబ్’ తుపాన్ పంజా విసిరేందుకు సిద్ధమైంది. ఈ తుపాను కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యంత తీవ్ర స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Also Read : Chandrababu Naidu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ.. కీలక అంశాలపై చర్చ!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖకు 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1020 కిలోమీటర్లు, బాపట్లకు 1,100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపింది.
సోమవారం ఉదయానికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుందని, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నాటికి అతితీవ్ర తుపానుగా మారే అవకాశం ఉండటంతో ఏపీలోని పలు జిల్లాల్లో భీకర గాలులతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అత్యంత తీవ్ర తుపానుగా ఏపీవైపు దూసుకొస్తున్న ‘అర్నబ్’ ప్రభావంతో ఏపీలోని 12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటలకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బుధవారం ఉదయం ఏపీలో తీర సమీపానికి చేరుకొని బాపట్ల – విశాఖ మధ్య తుపాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావంతో ఈనెల 27, 28 తేదీల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ముఖ్యంగా విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది.
ఈనెల 29వ తేదీ నాటికి తీవ్ర తుపాను తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. తుపాను తగ్గుముఖం పట్టే రోజున ఏలూరు, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
