Cyclone Arnab: ఏపీలో ‘అర్నబ్’ తుపాను విలయం.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కుండపోత.. అంధకారంలో జనజీవనం!
అర్నబ్ తుపాను (Cyclone Arnab)విలయంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షాలు కురిసి జనజీవనం స్తంభించింది.
- V Santhosh Kumar
- Updated on- October 28, 2026 / 09:10 AM IST
Cyclone arnab wreaks havoc in andhra pradesh heavy rains in north andhra
Cyclone Arnab: అర్నబ్ తుపాను ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని పలు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం సంపూర్ణంగా స్తంభించిపోయింది. కశింకోటలో అత్యధికంగా 26.3 సెంటీమీటర్లు, విజయనగరం భోగాపురంలో 26.2 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 26 సెంటీమీటర్ల మేర రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. బలమైన గాలుల ధాటికి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రహదారులపై రవాణా నిలిచిపోయి, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
అంధకారంలో మచిలీపట్నం.. బాపట్లలో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ:
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈదురుగాలుల దాటికి హోర్డింగులు, బారికేడ్లు ఎగిరిపడటంతో పాటు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో నగరం అంధకారంలో మునిగిపోయింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రేపల్లె నియోజకవర్గంలో ముంపు ముప్పు ఎదుర్కొంటున్న ప్రజల కోసం అధికారులు తక్షణమే 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు వేగవంతం చేశారు.
కోనసీమలో ఆస్తి నష్టం.. మధ్యాహ్నం వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక:
కోనసీమ ప్రాంతంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుల(Cyclone Arnab) కారణంగా పెద్దఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, యంత్రాంగం అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు ప్రకటించారు. నేలకొరిగిన చెట్లు, విద్యుత్ తీగలను తొలగించే పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రజలు మధ్యాహ్నం వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తెగిపడిన విద్యుత్ తీగల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
