Cyclone Murasu : దూసుకొస్తున్న ‘మురసు’ తుపాన్.. ఏపీలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు అతి భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
Cyclone Murasu : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఆదివారం తుపానుగా బలపడింది. ఈ తుపానుకు మురసు అని నామకరణం చేశారు. ఈ తుపాను కారణంగా ఏపీలోని మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
- Harish Thanniru
- Published on- November 2, 2026 / 06:43 AM IST
Cyclone Murasu
Cyclone Murasu : ఏపీలోని పలు జిల్లాల్లో గత వారం అర్నాబ్ తుపాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తుపాను కారణంగా ప్రజలు.. ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ తుపాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న వేళ.. ఏపీవైపు మరో తుపాను దూసుకొస్తుంది. ఈ తుపానుకు ‘మురసు’ అనే నామకరణం చేశారు.
Also Read : Jana Sena Pithapuram Tension : పోలింగ్ కేంద్రంలో రచ్చ.. పిఠాపురంలో హైటెన్షన్.. రీ పోలింగ్ కోసం జనసేన ఆందోళన!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఆదివారం తుపానుగా బలపడింది. గంటకు 27కిలోమీటర్ల వేగంతో కదులుతూ చెన్నైకి 480 కిలోమీటర్లు, నెల్లూరుకు 550 కిలోమీటర్లు, మచిలీపట్నంకు 560 కిలోమీటర్లు, ఒంగోలుకు 600 కిలోమీటర్లు, విశాఖపట్టణంకు 610 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇవాళ (సోమవారం) ఉదయంకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడనుంది. ఆ తరువాత వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు – నర్సాపురం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
మురసు తుపాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను తీరందాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. 4వ తేదీన ఉదయానికి తుపాను వాయుగుండంగా బలహీపడనుందని అధికారులు అంచనా వేశారు.
ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తీవ్రస్థాయిలో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ముఖ్యంగా ఇవాళ (సోమవారం) కృష్ణా, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, రెండుమూడు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
మంగళవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
