CM Chandrababu : చంద్రబాబు సభ సమీపంలో సిలిండర్ పేలుడు.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు!

CM Chandrababu : సీఎం చంద్రబాబు సభాస్థలి సమీపంలో సోడా గ్యాస్ సిలిండర్ పేలడంతో కలకలం రేగింది. సిలిండర్ 60 మీటర్ల దూరంలో ఎగిరిపడి విద్యుత్ వైర్లపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

  • Published on- September 30, 2026 / 05:19 PM IST

CM Chandrababu

  • సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే భారీ శబ్దం..
    60 మీటర్ల దూరంలో పడిన సోడా సిలిండర్
    కరెంట్ వైర్లపై ఎగిరిపడిన సిలిండర్..
    అప్రమత్తమైన పోలీసులు

CM Chandrababu : సీఎం చంద్రబాబు మీటింగ్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణానికి సమీపంలో సోడా గ్యాస్ సిలిండర్ పేలడం కలకలం రేపింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

సీఎం సభకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోడా తయారీలో వాడే గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలినట్లు సమాచారం. పేలుడు ధాటికి సిలిండర్ సుమారు 60 మీటర్ల దూరం ఎగిరి పడినట్లు తెలుస్తోంది. విద్యుత్ స్తంభం వద్ద ఉన్న కరెంట్ వైర్లపై ఎగిరిన సిలిండర్ పడటంతో పవర్ సప్లయ్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటన జరిగిన ప్రాంతంలో కొంతసేపు పరిస్థితి గందరగోళంగా మారింది.

Read Also : Upcoming Phones 2026 : ఈ అక్టోబర్‌లో మీ ఫోన్ మార్చేస్తారా? వివో నుంచి మోటో వరకు రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

చంద్రబాబు ప్రసంగం సమయంలోనే పేలుడు సంభవించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పేలుడు శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని గుర్తించేందుకు భద్రతా సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. సభకు హాజరైన ప్రజల్లోనూ ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నప్పటికీ, ఘటన కారణంగా ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

పేలుడు తర్వాత విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సంబంధిత సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. మరోవైపు సిలిండర్ పేలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సిలిండర్‌లో గ్యాస్ ఒత్తిడి పెరగడం వల్లే పేలిందా, లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే అంశంపై క్లారిటీ లేదు .

సీఎం సభకు సమీపంలో ఘటన జరగడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.