Dead Body in a car : విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం కలకలం రేపుతోంది. తాడిగడపకు చెందిన రాహుల్ మృతిలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రాత్రి ఏడున్నరకు ఇంట్లోంచి బయటకు వెళ్లిన రాహుల్.. చెప్పిన టైమ్‌కి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. నిన్న రాత్రి రాహుల్ పేరెంట్స్ నుంచి ఫిర్యాదు రావడంతో.. వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. విజయవాడ, హైదరాబాద్ హైవేలపై ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. అయితే.. ఎవరైనా రాహుల్‌ను సొంత కారులోనే కిడ్నాప్ చేశారా..? ఆ తర్వాత హత్య చేశారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఘటన తీరును చూసి.. రాహుల్‌ది ఆత్మహత్య కాదు.. హత్యేనంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
నిన్న రాత్రి ఏడున్నర గంటలకు ఇంట్లోంచి బయటకు వెళ్లాడు రాహుల్. గంటలో వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన రాహుల్ ఎక్కడికి వెళ్లాడు..? నిన్న ఎవరెవరిని కలిశాడు..? ఎవరితో ఫోన్ మాట్లాడాడు..? తాడిగడపకు చెందిన కరణం రాహుల్.. జి.కొండూరులో గ్యాస్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ కంపెనీ రన్ చేస్తున్నాడు. అయితే.. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే జి.కొండూరు నుంచి విజయవాడ వచ్చాడా..? లేదా ఎవరైనా మాట్లాడదామని పిలిపించారా..? అసలు కారులో ఎంతమంది ఉన్నారు..? నిన్న రాత్రి తొమ్మిది గంటలకు కారును పార్క్ చేసే సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు..? అనే ప్రశ్నలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
కారుకు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. కారు నీట్‌గా పార్క్ చేసి ఉంది.. కానీ.. డ్రైవింగ్ సీట్లో ఉన్న రాహుల్.. వెనక్కి పడిపోయిన ఉండటం అనుమానాస్పదంగా మారింది. డ్రైవింగ్ సీట్లో ఉన్నవారికి గుండెపోటు లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కారు కంట్రోల్ కాదు.. అలాంటి టైమ్‌లో.. కారుకు ప్రమాదం తప్పదు. అయితే.. ఇక్కడ అలాంటి సీన్ ఏమీ లేదు. రాహుల్‌కు గుండెపోటు వచ్చే వయసూ కాదు.. దీంతో అసలు ఏం జరిగింది.. రాహుల్ మృతికి కారణమేంటి..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రాహుల్ కాల్‌డేటాపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాహుల్ ఫోన్ నెంబర్ ఆధారంగా.. మృతుడు చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు..? ఎక్కువ సార్లు ఎవరికి ఫోన్ చేశాడనే వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడలోని ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు. కారు నెంబర్ ఆధారంగా బండి ఎక్కడక్కడ తిరిగింది.. ఏ ఏ ప్రాంతాల్లో ఆగిందనే వాటిపై ఆరా తీస్తున్నారు.
నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలోనే రాహుల్ డీవీ మేనర్ సందులోకి వచ్చినట్లు చెబుతున్నారు స్థానిక అపార్ట్మెంట్ వాచ్మెన్లు. ఉదయం ఏడున్నర గంటలకు కారులో మృతదేహం ఉన్నట్లు గుర్తించామని చెబుతున్నారు. అయితే.. రాత్రి పూట షిఫ్ట్‌లో వేరే వ్యాచ్మెన్ ఉండటంతో.. అతన్ని సైతం విచారించనున్నారు పోలీసులు. రాత్రి సరిగ్గా ఏ టైమ్‌లో కారు అక్కడికి వచ్చింది.. కారులో ఎవరెవరు వచ్చారు..? అక్కడ ఏమైనా ఘర్షణ జరిగిందా..? అన్న విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.