Duvvada Srinivas: కళింగ, కాపులపై కూటమి కక్ష సాధింపులు.. ఎవరినైనా తొక్కి పారేస్తాం.. విచారణ అనంతరం దువ్వాడ సంచలన కామెంట్స్

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(Duvvada Srinivas)ను పోలీసులు సుమారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం విడుదల చేశారు.

Duvvada Srinivas sensational comments on ap government and Pawan Kalyan

  • దువ్వాడ శ్రీనివాస్ సుదీర్ఘ విచారణ.
  • అచ్చెన్నాయుడుపై కుంభకోణం ఆరోపణలు.
  • కుల రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం.

Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు సుమారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం విడుదల చేశారు. అయితే, ఈ నెల 27వ తేదీ లోపు మరోసారి విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణ ముగిసిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పోలీసుల వేధింపులు.. అచ్చెన్నాయుడుపై ఆరోపణలు:

పోలీసులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎమ్మెల్సీ అనే కనీస గౌరవం లేకుండా ఉదయం నుంచి కూర్చోబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడారని దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) ఆరోపించారు. లేనిపోని అభాండాలు మోపుతూ, బలవంతంగా సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పేద ప్రజల పీడీఎస్ బియ్యం స్కామ్‌ను, ఊకపై జరుగుతున్న కమీషన్ల దందాను ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని విమర్శించారు. మంత్రి అచ్చెన్నాయుడు రూ.75 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తానే స్వయంగా ఆరోపించానని, ఆ కక్షతోనే తనను వేధిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

కుల రాజకీయాలు, భవిష్యత్ పోరాటం:

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కళింగ, కాపు, సామాన్య వెలమ సామాజిక వర్గాలను తీవ్రంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని దువ్వాడ ఆరోపించారు. తాను కళింగ కులానికి చెందినవాడిని కాబట్టే ఇంతలా టార్గెట్ చేస్తున్నారని, ఈ కులానికి చెందిన అధికారులను జిల్లాల దాటించి బదిలీలు చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్‌లు కలిసి తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. “నన్ను జైల్లో పెట్టినా డోంట్ కేర్, దేనికైనా రెడీ” అని సవాల్ విసిరిన ఆయన.. చట్టాన్ని గౌరవించి మరో ఐదు రోజుల్లో విచారణకు వస్తానని చెప్పారు. నడిరోడ్డుపై అంబేద్కర్ సాక్షిగా తన పోరాటాన్ని ప్రారంభిస్తానని, జిల్లా అంతటా పాదయాత్ర చేసి అన్ని కులాలను ఏకం చేస్తూ రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులను ఓడించి తీరుతామని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.