AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలనం.. రంగంలోకి దిగిన ఈడీ.. ముగ్గురు నిందితులు కస్టడీకి

లిక్కర్ స్కామ్(AP Liquor Scam) కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సునీల్‌కు నాంపల్లి కోర్టు మూడు రోజుల ఈడీ కస్టడీని మంజూరు చేసింది.

ED taken two accused persons into custody in andhra pradesh liquor scam.

  • మద్యం స్కాం నిందితులు కస్టడీకి
  • రూ.195 కోట్ల భారీ కుంభకోణం
  • మూడు రోజులు ఈడీ విచారణ

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం(AP Liquor Scam) రవాణా టెండర్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కోణంలో ముమ్మర దర్యాప్తు చేస్తోంది. టెండర్ల నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 195 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ప్రాథమికంగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నిధుల మళ్లింపు, అక్రమ ఆర్థిక లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Ap Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు వానలే వానలు

చర్లపల్లి జైలు నుండి ఈడీ ఆఫీస్‌కు నిందితులు:

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డిలతో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కు నాంపల్లి కోర్టు మూడు రోజుల ఈడీ కస్టడీని మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల అనంతరం చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితులకు చట్టప్రకారం ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, తదుపరి విచారణ నిమిత్తం వారిని ఈడీ కార్యాలయానికి తరలించారు.

మూడు రోజుల పాటు ముమ్మర విచారణ:

కోర్టు అనుమతించిన ఈ మూడు రోజుల కస్టడీలో భాగంగా నిందితులను విడివిడిగా, అవసరమైతే ఎదురెదురుగా కూర్చోబెట్టి అధికారులు ప్రశ్నించనున్నారు. టెండర్ల నిబంధనల మార్పులు, నిధుల బదిలీలు, ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ కుంభకోణంలో మరికొందరు అధికారుల పాత్రపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే పలువురి నుంచి వాంగ్మూలాలు సేకరించిన అధికారులు, ఈ కస్టడీ విచారణ ద్వారా మరిన్ని కీలక ఆధారాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు. విచారణ అనంతరం లభించే సమాచారం ఆధారంగా కేసులో తదుపరి చర్యలు వేగవంతం కానున్నాయి.