YS Jagan : ఎస్ఈసీపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆధారాలతో కోర్టుకెళ్తాం.. అంతుతేలుస్తాం..

YS Jagan : ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి ఆదివారం పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

YS Jagan

YS Jagan : డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం సీఎం చంద్రబాబు నాయుడుకు తొత్తుగా మారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై సంచలన కామెంట్స్ చేశారు.

Also Read : Cyclone Murasu : దూసుకొస్తున్న ‘మురసు’ తుపాన్.. ఏపీలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు అతి భారీ వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..

ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి ఆదివారం పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌ల్లో 70చోట్ల వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారని, ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాగేశారని జగన్ ఆరోపించారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయని అన్నారు.

ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌, సైక్లింగ్‌ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.

ఎస్ఈసీ చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? అంటూ జగన్ ప్రశ్నించారు.

పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్‌, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయని జగన్ అన్నారు.