Telangana Govt : తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్‌.. మీ సేవ ద్వారా సర్టిఫికెట్.. ఎవరికి ఉపయోగం..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Telangana Family Register : రాష్ట్రంలోని కుటుంబాల వివరాలన్నింటిని ఎలక్ట్రానిక్ పద్దతిలో నమోదు చేయడం ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Family Register in Telangana

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ప్యామిలీ రిజిస్టర్.. మీ సేవ ద్వారా సర్టిఫికెట్
  • ప్రతి కుటుంబానికి చెందిన 8 అంశాలు నమోదు

Telangana Family Register : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రభుత్వ సేవలు పొందే విషయంలో కుటుంబ వివరాలకు సంబంధించిన నమ్మకమైన రికార్డును చూపించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, కుటుంబ వివరాల పరిశీలనలో ఏకరూపత, సులభంగా అందుబాటులో ఉండటం లక్ష్యంగా రికార్డును రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read : Gold Silver Price Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ ఎంతంటే?

రాష్ట్రంలోని కుటుంబాల వివరాలన్నింటినీ ఎలక్ట్రానిక్ పద్దతిలో నమోదు చేయడం ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ రిజిస్టర్ కానీ, సర్టిఫికెట్ కానీ కేవలం డేటా‌బేస్ కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. డేటాబేస్‌లో ఆ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఫ్యామిలీ రిజిస్టర్ కార్డు ద్వారా ఎలాంటి హక్కులూ దఖలు పడవని పేర్కొంది. ఆస్తులపై ఎలాంటి టైటిల్ రాదు. చట్టపరమైన వారసత్వాన్ని ధ్రువీకరించదు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధికి ఉపయోగపడదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఈ ఫ్యామిలీ రిజిస్టర్‌లో కుటుంబానికి సంబంధించిన పలు వివరాలు నమోదు చేస్తారు. వీటిలో ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఆ కుటుంబ రేషన్ కార్డు నంబర్), కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, యజమానితో కుటుంబ సభ్యుల బంధుత్వం, ప్రతి సభ్యుడి వయస్సు, పుట్టినరోజు, పురుషుడు లేదంటే స్త్రీ లేదంటే ఇతరులు, ప్రతి సభ్యుడి ఆధార్ కార్డు, ఇంటి నంబర్, వీధి, గ్రామం లేదంటే వార్డు, గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ, మండలం, జిల్లాతో కూడిన కటుంబ చిరునామా నమోదు చేయాల్సి ఉంటుంది.

నిర్దేశించిన ఫీజును చెల్లించడం ద్వారా మీ సేవ కేంద్రం లేదంటే ఆన్‌లైన్ పోర్టల్ లేదంటే మొబైల్ అప్లికేషన్‌లో కుటుంబ సభ్యుడి ఈ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఆ కుటుంబ వివరాల్లో పేరున్న మేజర్ అయిన సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న రెండుమూడు రోజుల్లో సంబంధిత సర్టిఫికెట్ ను జారీ చేస్తారు.

ఇదిలాఉంటే.. సర్‌కు కూడా ఇది ఉఫయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని విచారణ సమయంలో రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. అందులో 10వ పత్రంగా ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కూడా ఉంది. ఏ పత్రాలు లేనివారికి ఇది ఉపయోగపడుతుంది.