Alla Nani : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.. వైఎస్ జగన్, నారా లోకేష్ సంతాపం
Alla Nani Passes Away : మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖ సీతమ్మధారలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మాజీ మంత్రి ఆళ్ల నాని మృతిపట్ల వైఎస్ జగన్, నారా లోకేష్ సంతాపం తెలిపారు.
Alla Nani Passes Away
- మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత..
- సీతమ్మధార నివాసంలో గుండెపోటుతో మృతి
- సీతమ్మధారలో తన నివాసంలో మాజీ మంత్రి భౌతిక కాయ
- ఏలూరు స్వగృహనికి మృత దేహం తరలింపు
Alla Nani Passes Away : ఏపీ రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆళ్ల నాని (ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆళ్ల నాని రాజకీయ ప్రయాణం :
ఆళ్ల నాని రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. తొలుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఏలూరు నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ముఖ్యమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే, 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడియన ఆయన ఇటీవలే టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినప్పటికీ పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
ఆయన భౌతికకాయాన్ని సుమారు రెండు గంటల్లో ఏలూరులోని స్వగృహానికి తరలించనున్నట్లు సమాచారం. ఆళ్ల నాని ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, రాజకీయ నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మాజీ మంత్రి నాని మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ :
“ఆళ్ల నాని మృతి నన్ను కలచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను” జగన్ పేర్కొన్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి, ‘ఆళ్ల నాని’ గుండెపోటుతో మృతి చెందారనే సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే నాని గారి స్మృతిలో నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/7Tz4DJga7q
— Lokesh Nara (@naralokesh) September 15, 2026
నారా లోకేష్:
టీడీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో మృతి చెందారనే సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే ఆళ్ల నాని స్మృతికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
