Burglaries
Visakhapatnam: అతడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. బాగానే జీతం వచ్చేది. అయినప్పటికీ, ఇంకా డబ్బు కావాలన్న ఆశ. లగ్జరీ కార్లలో తిరగాలి, హైదరాబాద్‌లో పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండాలన్న కోరికలు ఉన్నాయి. అంత డబ్బును న్యాయంగా సంపాదిస్తే ఏ బాధా ఉండదు.
అయితే, తన ఆశలను నెరవేర్చుకునేందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. తాళాలు పగులగొట్టి, ఇళ్లలోకి చొరబడి డబ్బు, ఆభరణాలు ఎత్తుకెళ్తున్నాడు. ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు వివరాలు తెలిపారు.
ఈ దొంగ పేరు అచ్చి మహేశ్ రెడ్డి అలియాస్ సన్నీ. వయసు 27 ఏళ్లు. రాత్రివేళల్లో వరుసగా దొంగతనాలు చేస్తున్నాడు. కాకినాడకు చెందిన సన్నీ విశాఖ మాధవధార ప్రాంతంలో నివసించేవాడు.
ఉన్నత విద్య చదివి, ఐటీ ఉద్యోగం ఉన్నప్పటికీ బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వంటి ఖరీదైన జీవనశైలిని కొనసాగించేందుకు నేరాలకు దిగినట్లు పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశాక.. గాజువాక, అరిలొవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ పోలీస్ పరిధుల్లో చోటుచేసుకున్న 26 ఇళ్ల చోరీలు అతడు చేసినవేనని విశాఖ పోలీసులు గుర్తించారు.
Also Read: నరాలుతెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్ కూడా డ్రా.. రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా ఎలా గెలిచిందంటే?
ఆయా ప్రాంతాల్లో సుమారు రూ.24.66 లక్షల విలువైన ఆభరణాలు, నగదును సన్నీ దోచుకెళ్లాడు. ఇందులో 1,084 గ్రాములకుపైగా బంగారం, 6,300 గ్రాములకుపైగా వెండి, రూ.40,500 నగదు ఉన్నాయి.
అరెస్టు సమయంలో 699 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.8 కిలోల వెండి ఆభరణాలు, బీఎండబ్ల్యూ కారు, నంబర్ ప్లేట్ లేని స్కూటర్, దొంగతనాలకు వాడిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన మొత్తం సొత్తు విలువ రూ.15.63 లక్షలకుపైగా ఉందని అంచనా.
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చి తెలిపిన వివరాల ప్రకారం.. సన్నీకి 15 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు చేసిన చరిత్ర ఉంది. 15 ఏళ్ల వయస్సులో పీఎం పాలెం ప్రాంతంలో ఇళ్లలో చొరబడుతూ పట్టుబడి జువెనైల్ హోమ్‌కు వెళ్లాడు.
విడుదల తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రపురం, ఇంద్రపాలెం, రాజమండ్రి ప్రాంతాల్లో దొంగతనాలు కొనసాగించాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 నెలలు శిక్ష అనుభవించాడు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా దొంగతనాల కేసుల్లో అతడు ఉన్నట్లు పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
మాస్కులు, టోపీలు, గ్లోవ్స్ ధరించి, హామర్లు, స్క్రూడ్రైవర్లు, డ్రిల్లింగ్ యంత్రాలు వంటి పరికరాలతో ఇళ్లలోకి చొరబడేవాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. సంబంధిత కేసులన్నింటిలో పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి, ప్రాసిక్యూషన్ ప్రక్రియకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.